కొల్లాపూర్/వెల్దండ / అచ్చంపేట రూరల్ : యోగా ( Yoga ) ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని, యోగా సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ( Minister Jupalli Krishna Rao ) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొల్లాపూర్లో శనివారం పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో పాల్గొని యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా భారతీయ ఘన వారసత్వ సంపదని, యోగా ప్రాచీన సంస్కృతిలో ఒక భాగమని పేర్కొన్నారు. మానవుడు తన జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రాచీన జీవన విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యోగా, ధ్యానంతో మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలను అధిగమించ వచ్చన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసు నుంచే యోగా, ధ్యానం, వ్యాయామాన్ని అలవాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ నిత్యం గంట పాటు శారీరక వ్యాయామం చేయాలని, తద్వారా మానసిక, శారీరక సమతౌల్యం కలుగుతుందని చెప్పారు.
వెల్దండ పల్లె దవాఖానాలో..
మండలంలోని కొట్ర పల్లె దవాఖానలో డాక్టర్ నవీన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్థులు యోగాలో పాల్గొన్నారు.
ధ్యాన మందిరం పిరమిడ్ కేంద్రంలో..
Acchempet Rural Yoga
అచ్చంపేట పట్టణం వెంకటేశ్వర కాలంలో శ్రీ సాయి ధ్యాన మందిరం పిరమిడ్ కేంద్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి మల్లేష్, ఉమామహేశ్వర దేవస్థానం చైర్మన్ మాధవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి , మాజీ ఎంపీపీ రామనాథం, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, సాయి యోగా మందిరం పిరమిడ్ నిర్వాహకులు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.