నాగర్‌కర్నూల్, నవంబర్ 12 : తమకు దైవశక్తి ఉందని, పూనకం వస్తుందని, మైసమ్మకు పూజలు చేస్తానని ప్రజల్ని నమ్మ బలికి మీ ఇంటి ఆవరణలో బంగారం ఉంటే తీసి ఇస్తామంటూ అమాయకులను మోసం చే స్తూ సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు మహిళలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి 1160 బంగారాన్ని పోలి ఉన్న నకిలీ బిల్లలు, తాయత్తులతోపాటు రూ.7 ల క్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన అలివేల అనే మహిళ గత మూ డు సంవత్సరాల నుంచి నాగర్‌కర్నూల్‌లో ఉంటున్నది.
తనకు దైవశక్తి ఉందని, పూనకం వస్తుందని, మైసమ్మకు పూజలు చేస్తానని ప్రజలను నమ్మబలుకుతుండేదని, ఆరోగ్యం లేదా ఇతర సమస్యలతో తనను ఆశ్రయించిన వ్యక్తులకు పూజలు చేసి వారిని నమ్మించేదన్నారు. నమ్మిన వారి ఇంటి పరిసరాలు, వారి పొలాల్లో బంగారం ఉందని, దానిని తీ స్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, అందుకు పూజలకోసం డబ్బులు చెల్లించాలని నమ్మించేది.
ఈక్రమంలోనే తన వద్దకు పూజలకోసం వచ్చిన వికారాబాద్ జిల్లాకు చెందిన అనిత అనే మహిళ పరిచయం కావడంతో ఇద్దరు కలిసి నమ్మిన ప్రజలను పూజల పేరుతో మోసం చేయాలని నిర్ణయించుకొని తాము ముందుగా అనుకున్న ప్రణాళికా ప్రకారం డబ్బులు ఇచ్చిన బాధితులను నమ్మించడానికి బంగారు రంగును పోలిన నకిలీ నాణాలను పూజా స్టోర్ల నుంచి కొనుగోలు చేసి బాధితుల వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత నకిలీ నాణాలను వారికి సం బంధించిన స్థలాల్లో ప్రాంతాల్లో పాతిపెట్టేవారు. ఆ తర్వాత పూజలు చేసినట్లు నటించి ముందుగానే పాతిపెట్టిన నకిలీ నాణాలను బయటకు తీసి బాధితులను మోసం చేయడానికి నిర్ణయించుకున్నారన్నారు. ఇందులో భాగంగానే అలివేల, అనితలు కలిసి బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామానికి చెందిన వేముల శ్రీరామ్‌సాగర్ నుంచి రూ.4 లక్షలు, నాగర్‌కర్నూల్ మండలం శ్రీపురం గ్రామానికి చెందిన నిరంజన్ నుంచి రూ.2.50 లక్షలు నగదును వసూలు చేశారని ఎస్పీ తెలిపారు.
వీరితోపాటు పలువురు బాధితుల నుంచి వీరిరువురు డబ్బులు వసూలు చేశారని వెల్లడించారు. వీరి నుంచి బంగారును పోలి ఉన్న నకిలీ(ఒకవైపు లక్ష్మీదేవి బొమ్మ, మరోవైపు శ్రీచక్రం) ఉన్న 1160 నాణాలను, రెండు ప్యాకెట్ల బంగారు రంగులో ఉన్న తాయత్తులు, ఎర్ర బట్ట కట్టిన ఒక చిన్న కుండతోపాటు రూ.7 లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే ప్రజలు ఇటువంటి మోసాలను నమ్మవద్దని, క్షుద్రపూజల వెనుక ఆర్థికమోసం దాగి ఉంటుందని, అత్యాశకుపోయి గుప్త నిధుల ద్వారా బంగారు తీస్తామని చెప్పి మోసం చేసేవారి మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.