మహబూబ్‌నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీర్ల కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ యువకుడిని వైన్స్ యాజమాన్యం విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపి 34 రోజులు అవుతున్నా దాడి చేసిన సదరు దుకాణం యాజమాన్యం మాత్రం పబ్లిక్‌లో తిరుగుతున్నారు. పోలీస్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన పోలీసులు దాడి జరిగిన రోజు ఫిర్యాదు తీసుకోకుండా.. సదరు యువకుడు చనిపోయాక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లాలో ఓ యువకుడు వైన్స్ షాపు వద్ద జరిగిన దాడిలో చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం దొరకని పరిస్థితి.
ఈ వైన్స్ యాజమాన్యం వెనుక కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో పోలీసులు వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలో ఈ ఘటన జరిగినా సంబంధిత శాఖ అధికారులు కనీసం సదరు వైన్స్షాపుపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. తమ కొడుకును అన్యాయంగా చంపేశారంటూ ఆ కుటుం బం కనబడిన వారందరికీ కన్నీరుమున్నీరై చెబుతున్నది. చర్యలు తీసుకోవాల్సి న యంత్రాంగం పూర్తిస్థాయిలో అధికార పార్టీకి వత్తా సు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వైన్స్ మాఫియా రాజ్యమేలుతోంది. సిండికేట్‌గా మారి ఇష్టం వచ్చిన రేట్లు పెంచి అమ్ముతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా కర్ణాటక నుంచి మద్యం దిగుమతి అవుతున్నా.. నకిలీ మందు విచ్చలవిడిగా వైన్స్ షాపుల్లో అమ్ముతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దుకాణాల వద్ద ప్రైవేట్ గూండాలను నియమించుకోవడం.. కస్టమర్లపై దాడులకు దిగ డం.. బెల్టు షాపులకు మందు సరఫరా చేయడం.. నిత్యకృత్యంగా మారింది. ఫలితంగా ఓ యువకుడు వైన్స్ మాఫియా కు బలైపోయాడు. నేరస్తులు, దొంగల పాలిట సింహస్వప్నమైన పోలీసులకు డ్రైవర్ అవుదామనుకున్నాడు.. అతని చెల్లి ట్రైనీ ఎస్సైగా పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నది. బంధువుల గృహప్రవేశానికి వచ్చిన యువకుడు అన్యాయంగా మృతి చెందాడు. నాటి నుంచి న్యాయం కోసం ఆ కుటుంబం కన్నా కష్టాలు పడుతున్నది.
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన శ్రీకాంత్ యాదవ్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 24న సమీప బంధువుల గృహ ప్రవేశానికి హాజరయ్యాడు. బంధువులు బీర్లు కావాలంటే పట్టణంలోని బండమీదిపల్లి వద్ద శ్రీ మల్లికార్జున వైన్స్ వద్దకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. అప్పటికే అక్కడ చిన్న గొడవ జరుగుతుంది. ఇది గమనించిన శ్రీకాంత్ తమకు బీర్లు కావాలని అడిగాడు. బీర్లు ఇచ్చాక కౌంటర్లో ఉన్న ఒక వ్యక్తి దురుసుగా మా ట్లాడాడు. ఎందుకిలా మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తే దుర్భాషలాడాడు. స్నేహితులు వారించడంతో శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
రోడ్డు దాటి వెళుతున్న అతడి వద్దకు వైన్స్ షాపునకు చెందిన కొందరు వచ్చి ఓనర్ పిలుస్తున్నాడంటూ చెప్పారు. వెనక్కి వచ్చిన ఆ యువకుడిపై అరుణ్ కుమార్‌రెడ్డి, కృష్ణారెడ్డి, బబ్లూ, వెంకటేశ్, శివశంకర్‌తోపాటు కొందరు దారుణంగా కొట్టారు.అంతటితో ఆగకుండా వైన్స్ వెనక్కు తీసుకెళ్లి రూమ్‌లో వేసి విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డా రు. శ్రీకాంత్‌తో పాటు వెళ్లిన అతడి సమీప బంధువు రాఘవేంద్ర కుటుంబీకులకు సమాచారం అందించారు. శ్రీకాంత్ తండ్రి వచ్చి తీవ్ర గాయాలతో ఉన్న కొడుకును తీసుకెళ్లాడు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మల్లికార్జున వైన్స్ వద్ద జరిగిన గొడవలో యువకుడు చనిపోయిన మాట వాస్తమే.. ఇందుకు కారకులైన వారి కోసం గాలిస్తున్నామని ‘నమస్తే తెలంగాణ ప్రతినిధికి’ మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ వివరించారు. మొత్తం పది మందిపై మర్డర్ కేసు నమోదు చేశామని, నిందితులను ఒకటి, రెండు రోజుల్లో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలిస్తామన్నారు. సదరు వైన్స్ యజమానులపై చర్యలు తీసుకోవాల్సింది ఎక్సైజ్ అధికారులని, అది తమ పరిధిలోకి రాదని చెప్పుకొచ్చారు.
వైన్స్ వద్ద తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ యాదవ్ ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు.. అదే నెల 26వ తేదీన మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్సై విజయభాస్కర్ ఫిర్యా దు తీసుకోవడానికి నిరాకరించాడు.
మీరు ఏమన్నా బడికి పోయారా..? గుడికి పోయారా? మీరే వైన్స్ వద్ద దౌర్జన్యం చేశారంటూ.. మీపై కేసు పెట్టి బొక్క లో వేస్తా.. అంటూ హెచ్చరించాడు. దీంతో భయపడిన సదరు కుటుంబీకులు వెనుతిరిగారు. ఈ విషయాన్ని ట్రైనీ ఎస్సైగా పనిచేస్తున్న తమ కూతురు తారకకు తెలిపారు. ఆమె సూచన మేరకు మరుసటి రోజు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి నా కొడుకును చాలా దెబ్బలు కొట్టారు.. ఫిర్యాదు తీసుకోవాలంటూ వేడుకున్నారు. అక్కడున్న సిబ్బంది కైంప్లెంట్ తీసుకున్నాక వెళ్లిపోవాలని దబాయించారు.
మూగదెబ్బలకు గురైన శ్రీకాంత్ అదే రోజు జిల్లా కేంద్రంలోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స చేసి మందులిచ్చి పంపించారు. ఇది జరిగిన వారం రోజులకే పరిస్థితి విషమించింది. వెంటనే కొత్తకోటలోని రాహుల్ దవాఖానకు యువకుడిని తీసుకెళ్లగా.. ఇన్ని దెబ్బలు తగిలితే ఏం చేస్తున్నారని కుటుంబీకులను ప్రశ్నించారు. అక్కడి నుంచి ఎస్వీఎస్కు తరలించ గా.. శరీరంలోని భాగాలు దెబ్బతిన్నాయని, వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాడని సూచించగా.. ఓవైసీ వైద్యశాలకు పరిస్థితి విషమించడంతో యశోద తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 14న ఉద యం తెల్లవారుజామున మృత్యుఒడిలోకి చేరాడు.
శ్రీకాంత్ యాదవ్ చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలని కలలుగనేవాడు. వాళ్ల నాన్న వెంకటేశ్ గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు, కూతురిని పోలీసులను చేద్దామని శ్రమించేవాడు. కూతురు తారక ఎస్సైగా సెలెక్ట్ కాగా.. ప్రస్తుతం పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. కొడుకు శ్రీకాంత్‌ని కూడా కానిస్టేబుల్‌గా చేయాలనుకున్నాడు.
కానీ కానిస్టేబుల్ అయితే ఏముంటుంది పోలీస్ బాస్‌లు నిందితులను పట్టుకోవడానికి వెళ్లే వాహనానికి డ్రైవర్ అయితే బాగుంటుంది నాన్న అంటూ కష్టపడ్డాడు. ఇటీవల జరిగిన సెలక్షన్‌లోనూ కొన్ని మార్కులతో ఉద్యోగం కోల్పోయాడు. పోలీస్ అవుదామనుకున్న కుటుంబానికి పోలీసులు అన్యాయం చేయడం.. అధికార పార్టీకి వత్తాసు పలకడం.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్ యజమానుల దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ యాదవ్ చనిపోగా ఆయన మృతదేహాన్ని తీసుకొని కుటుంబీకులు దాడి జరిగిన వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. అప్పటికే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రూరల్ సీఐ గాంధీనాయక్ హడావుడిగా అక్కడికి చేరుకొని వారిని ఒప్పించి ఆందోళన విరమింపజేయించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దవాఖానకు తరలించారు. అయితే ఏప్రిల్ 25, 26న వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సదరు యువకుడు మృతి చెందిన రోజు అంటే దాదాపు 18 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం గమనార్హం. సంబంధిత వైన్స్ యజమానులు మాత్రం స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు న్యాయం కోసం జిల్లా ఎస్పీని కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఏఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో యాదవ సంఘాలు ఆందోళన చేపట్టాయి.
సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఓ యువకుడిని వైన్స్ షాప్ ఎదుట కొట్టి చంపిన వైనం పై పోలీసులు కానీ.. ఎక్సైజ్ అధికారులు కానీ చర్య లు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ యజమానుల వెనుక అధికార పార్టీకి చెందిన కొందరి హస్తముందని గుసగుసలు ఉన్నా యి. వైన్స్ వద్ద దాడి జరిగిందని జిల్లా మొత్తం కోడైకూస్తున్నా ఎక్సైజ్ అధికారులు కనీసం సదరు మద్యం దుకాణళం వద్దకు వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో ఈ సంఘటన జరిగినా అధికార పార్టీ నేతలు కనీసం ఖండించలేదు. ఇకనైనా పోలీ సు, ఎక్సైజ్ అధికారులు స్పందించి జరిగిన ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని శ్రీకాంత్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
మా అన్న కొడుకు బీర్ల కోసం వెళితే వైన్స్ యాజమాన్యం ఇష్టం వచ్చినట్టు దాడి చేసింది. న్యాయం చేయమని పోలీసుల వద్దకు వెళితే పట్టించుకోలేదు. తీవ్రంగా గాయపడిన కొడుకును కాపాడుకునేందుకు దవాఖానల చుట్టూ తిరిగి రూ.లక్షలు ఖర్చుపెట్టినం. అయినా ప్రాణాలను కాపాడుకోలేకపో యాం. పోలీసులు మా అన్న కుటుంబానికి చేసే న్యాయం ఇదేనా..? మా శ్రీకాంత్‌పై దాడి చేసిన మద్యం దుకాణాన్ని సీజ్ చేసి యజమానులను అరెస్టు చేయాలి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. సీఎం రేవంత్ సొంత జిల్లాలో మాలాంటి పేదోళ్లకు న్యాయం జరగలేదు. మా కు టుంబ సభ్యులమంతా కలిసి సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఆందోళన చేపడుతాం..