వనపర్తి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కొత్తగా ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన విషయం విధితమే. జిల్లాలో దాదాపు 150 మంది వరకు నూతన ఉపాధ్యాయులుగా విధుల్లో చేరారు. అయితే.. ఆ ఉద్యోగులందరికీ జీతాలు ఎప్పుడొస్తాయో అంతుబట్టడం లేదు. గత నెలలో విధుల్లో చేరగా ఇప్పటి వరకు వారి వేతనాలకు సంబంధించిన కార్యాచరణ కనిపించడం లేదు. దీంతో జిల్లా పరిధిలో పనిచేస్తున్న కొత్త ఉపాధ్యాయులు వేతనాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్‌లో అక్టోబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం చేతుల మీదుగా 10వ తేదీతో ఉపాధ్యాయ నియామక పత్రాలను నూతన ఉపాధ్యాయులకు అందజేశారు. అయితే పాఠశాలలో జాయిన్ అయిన తేదీ అంటూ మళ్లీ డీఈవో అక్టోబర్ 16వ తేదీన మరో నియామక ఉత్వర్వులు ఇచ్చారు. ఇలా రెండు ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త వేతనాలను ఏ తేదీ నుంచి లెక్కలోకి తీసుకోవాలనే విషయంలో గందరగోళం నెలకొంది. కొలువుల్లో చేరిన ఉద్యోగులు వేతనాల కోసం గంపెడాశతోఎదురు చూస్తున్నారు.
ఇలా రెండు ఉత్తర్వులు ఇవ్వడంపై ప్రభుత్వానికి క్లారిటీ కోసం మళ్లీ ప్రతిపాదించారు. ప్రభుత్వం నుంచి ఏదో ఒక తేదీని ప్రకటిస్తే తప్పా వేతనాలు చేయలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలోనే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అక్టోబర్ 10నుంచే వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు సైతం ఇచ్చారు. దీనిపై ఆర్థికశాఖ క్లియరెన్స్ ఇవ్వనందునా కొత్త ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో పడ్డాయి. లేదంటే అక్టోబర్ 16నుంచి వేతనాలు చేసుకోవాలనుకునే వారు మాత్రం ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. ప్రభుత్వం ముందు చెప్పి ఉత్తర్వులు ఇచ్చినందునా అక్టోబర్ 10 నుంచి వేతనాలను పరిగణలోకి తీసుకోవాలని కొత్త ఉద్యోగులంతా అడుగుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో వేతనాలకు సంబంధించి ప్రతి నెలా 25 తేదీలోపు ఫైల్స్‌ను సిద్ధం చేసి పంపిస్తారు. ఈ లెక్కన ఈ నెలలో కూడా కొత్త వారికి వేతనాలు చేయాలంటే ఇక కేవలం 2 రోజులే మిగిలింది. ఇప్పటికే నెలలో చేయాల్సిన ఉపాధ్యాయుల వేతనాల ప్రక్రియను కొన్ని పాఠశాలల్లో ముగించారు. ఇంకా రెండు ఉత్తర్వులపై ప్ర భుత్వం నుంచి స్పష్టత త్వరలో వస్తుందన్న నమ్మకం కూడా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ కొలువులో చేరినా వేతనాలు అందడంలో గ్యారెంటీ లేనట్లుగా కొత్తఉద్యోగుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా అనేక గందరగోళాల మధ్య కొత్త ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడు అందుతాయో వేచి చూడాల్సిందే మరీ.
కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ప్రతి ఒక్కరికీ ట్రెజరి కార్యాలయం నుంచి ఐడీ నెంబరు, ప్రాన్(పీఆర్ఏఎన్) నెంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగాల్లో చేరిన అనంతరం వీరు దరఖాస్తు ప్రాసెస్‌ను పూర్తి చేయగా, ఇటీవలే ఐడీ, ప్రాన్ నెంబర్లను జారీ చేశారు. ఐడీలు త్వరగా ఇచ్చినా ప్రాన్ నెంబర్ల జారీని చాలా రోజులు పెండింగ్‌లో ఉంచి జాప్యం చేశారు. డబ్బుల కోసమే ప్రాన్ నెంబరు ఇవ్వకుండా తాత్సారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.500 ఇచ్చిన వారికి వెంటనే ఇచ్చారని, డబ్బులు ఇవ్వని వారికి అప్పుడు, ఇప్పుడంటూ దాటవేసినట్లు తెలిసింది.
అయి తే.. ప్రాన్ నెంబర్లకు లంచం అడుగుతున్నారన్న సమాచారం బయటకు తెలియడంతో పెండింగ్‌లో ఉన్న వాటిని చకాచకా పూర్తి చేయగా, సాంకేతిక లోపంతో ఉన్న దాదా పు పది దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు స మాచారం. జిల్లాలో వనపర్తి, ఆత్మకూరులో ఎస్టీవో కార్యాలయాలుండగా మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాలు ఆత్మకూరు పరిధిలోకి వస్తాయి. మిగితా మండలాలన్నీ వనపర్తి ట్రెజరీ పరిధిలోకి వస్తాయి. ఐడీ నెంబర్ మాత్రం ప్రతి ఉద్యోగికి జిల్లా కోశాధికారి కార్యాలయం ద్వారానే కేటాయించడం జరుగుతుంది.