గద్వాల అర్బన్ : గద్వాల జిల్లా కేటిదొడ్డి( KT Doddi ) మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎద్దుల దొంగతనం కేసులో ( Bull theft Case ) ప్రధాన సూత్రదారిని కేసు నుంచి తప్పించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఇద్దరిని పట్టుకుని సూత్రదారిని పట్టించుకోకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున చేతులు మారడం వల్లే సూత్రదారిపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు .
గత నెలలో ఎద్దుల దొంగతనంపై పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని కర్నాటక రాష్ట్రంలో పట్టుకున్నారు. మరో వ్యక్తి గురించి ఆరా తీయగా చోరీలో ప్రధానమైన వ్యక్తి బెంగూళురులో ఉంటు పశువుల తరలింపు వ్యవహరంలో కీలకంగా ఉంటున్నట్లు గుర్తించారు.
సదరు వ్యక్తి బెంగుళూర్లో ఆర్థికంగా, పలుకుబడిన వ్యక్తి కావడంతో కేసు నుంచి తప్పించుకునేందుకు సదరు ప్రధాన నిందితుడు సింధనూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని అశ్రయించాడు. ఆ వ్యక్తి ఆగస్టు చివరి వారంలో పోలీస్ అధికారులతో సంప్రదింపులు జరిపి కీలక సూత్రదారిని కేసు నుంచి తప్పిస్తే ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు తెలిసిందని బాధితులు, గ్రామస్థులు ఆరోపించారు. దీంట్లో భాగంగానే ఇద్దరు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారని, ప్రధానమైన వ్యక్తి పరారీలో ఉన్నట్లు కేసులో చూయించి రిమాండ్కు వెళ్లిన నిందితులు బయటకు వచ్చే సమయంలో సెక్షన్ 41 నోటీసు మీద బెయిల్ ఇచ్చే విధంగా ఇరువురి మధ్య ఒప్పందం చేసుకున్నట్లు అనుమానం ఉందని ఆరోపించారు.
కేసులో ఎవరిని తప్పించ లేదు : డీఎస్పీ మొగిలయ్య
ఈ కేసులో ఎవరిని తప్పించింది లేదు. నిందితులపై జిల్లాలోని గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో 4 కేసులు, ధరూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశాం. ముడుపుల వ్యవహారంలో ఏమైనా సాక్షాలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు.