హైదరాబాద్ : పాలమూరు రంగారెడ్డి ( Palamur Rangareddy ) పై బీఆర్ఎస్ నాయకుల పాదయాత్ర అనగానే ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టుల సందర్శన చేపడుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరులో ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ ( KCR ) అని, కట్టిన ప్రాజక్ట్ల పనులు 80 నుంచి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని వెల్లడించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌తో సుడిగాలి పర్యటన చేస్తున్నారని, ఈ పర్యటనలో కర్ణాటక మంత్రి బోసు రాజు వస్తున్నారని అధికారిక షెడ్యూల్ లో పొందుపరిచారని వివరించారు. బోసురాజు ప్రస్తుతం మంత్రిగా లేనేలేరు. మంత్రిగా లేని వ్యక్తి వచ్చి ఏం చేస్తారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి రివ్యూపై క్లారిటీ వచ్చిన తరువాత బీఆర్ఎస్ స్పందిస్తుందని వెల్లడించారు.హార్టికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.కొల్లాపూర్మామిడి రైతులకు మేలు చేయలేక పోతున్నారని విమర్శించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలో లష్కర్ ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి మాట తప్పాడని ఆరోపించారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు అవుతుందని ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా స్థానిక బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. సీఎం పర్యటన విహార యాత్రలా మిగిలిపోకుండా పాలమూరు సమస్యలను పరిష్కరించాలని, రామన్నగట్టు రిజర్వాయర్ పై రివ్యూ చెయ్యాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు కురువ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .