న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ(Lalit Modi) తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరి నుంచీ తానేమీ పారిపోవడం లేదన్నారు. ఎటువంటి నేరం తనపై రుజువు కాలేదన్నారు. భారతీయ అధికారుల నుంచి విజయవంతంగా దాక్కుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అది కేవలం మీడియా తన సెన్షేషన్ కోసం చేస్తున్న ప్రచారం మాత్రమే అన్నారు. న్యాయపరంగా తాను అందరికీ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఎక్కడికీ పారిపోవడం లేదన లలిత్ మోదీ.. గ్లోబల్ సూపర్‌పవర్ ఇండియా నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన అంశమన్నారు. ఒకవేళ నిజంగా నేను పారిపోతుంటే, అప్పుడు భారత్ నన్ను పట్టుకోవడం కష్టమైన పనేకాదని, భారతీయ ప్రభుత్వానికి చాలా సత్తా ఉందని, భారత ప్రభుత్వంతో పెట్టుకోలేమని, నాకు ఆ ఉద్దేశం కూడా లేదని, ప్రభుత్వం కాదు, కానీ మీడియానే అతి చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
మీడియా అంశంలో కఠినమైన పరువునష్టం చట్టాలు లేకపోవడం సమస్యగా మారిందన్నారు. ఇండియాలో మీడియాపై కేసులు లేవని, దాని వల్లే ఇష్టం వచ్చినట్లు వార్తలు ఇస్తున్నారని ఆరోపించారు. మనీల్యాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన కేసులను మోడీ ఎదుర్కొంటున్నారు. కానీ తనపై ఇప్పటి వరకు ఎటువంటి నేరపూరిత ఆరోపణలు రుజువు కాలేదన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థను లలిత్ మోడీ తప్పుపట్టారు. భారత్‌లో న్యాయం ఆలస్యంగా దక్కుతుందని, నెమ్మదిగా న్యాయం అందడం అంటే, అదో పెద్ద శిక్ష అన్నారు.
ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఒకవేళ నిజంగా తాను చెడ్డవాడినే అయితే, అప్పుడు మీరు న్యాయం ప్రకారం ప్రాసిక్యూట్ చేయవచ్చు అన్నారు. ఇక ఇప్పుడు ఇండియాకు తిరిగి రావాలన్న ఆలోచన లేదన్నారు. మీరు నన్ను అరెస్టు చేయాలనుకుంటున్నారా.. 17 ఏళ్ల నుంచి మీరు నన్ను కోర్టుకు తీసుకెళ్లలేదు, మీరెలా నన్ను అరెస్టు చేయగలదరు, ఒకవేళ ఏదైనా ఉంటే, అదే జరుగుతుందని లలిత్ మోడీ అన్నారు.
ఐపీఎల్ చైర్మెన్‌గా లలిత్ మోడీ ఉన్న సమయంలో జరిగిన ఆర్థిక అక్రమాలపై ఈడీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.