మహబూబ్నగర్ : ఉత్కృష్టమైన తెలంగాణ సంస్కృతి, సాహిత్యాలను వెలుగులోకి తీసుకు వచ్చి సబ్బండ వర్ణాల చెంతకు తీసుకువెళ్లడమే తెలంగాణ సాహిత్య అకాడమీ ధ్యేయమని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వచ్చిన ఆయన ఆర్అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన రాష్ట్ర సాహిత్య అకాడమీ తెలంగాణ ఆత్మగౌరవానికి, సంస్కృతి సాహిత్యాలను విశ్వ వినువీధుల్లో ఎగురవేసేందుకు ఒక మంచి వేదిక అని అన్నారు.
సాహిత్య అకాడమీ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నదని, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మరుగున పడిపోయిన సాహిత్యాన్ని వెలుగులోకి తేవాలన్నదే తమ తపన అని తెలిపారు.
తెలంగాణ సాహిత్యాన్ని ఊరూరా, వాడవాడలా, గడపగడపకు, సబ్బండ వర్ణాల వారి వద్దకు తీసుకువెళ్లడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ సాహిత్యం గ్రంథస్తం చేయడం, మహబూబ్నగర్ లాంటి జిల్లా కవులు, కళాకారులకు పెట్టింది పేరని, ఇక్కడ అనేకమంది సాహితీవేత్తలు, వారు రచించిన గ్రంథాలను, సర్వస్వాలను గ్రంథాల రూపంలో ప్రజల వద్దకు తీసుకు వెళ్తామన్నారు. సాహిత్య సంపదను విస్తృతం చేయడంలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ సహాయ సంచాలకులు వెంకటేశ్వర్లు, కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, భీంపల్లి శ్రీకాంత్, వనపట్ల సుబ్బయ్య ,కపిలవాయి అశోక్ బాబు, పుట్టి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.