గద్వాల, ఫిబ్రవరి 2 : కృష్ణాజలాలను కేంద్రానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతోపాటు తెలంగాణను ఎడారిగా మార్చేందుకు కుట్రలు చేస్తున్న విషయాన్ని, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కృష్ణాజలాల వివాదం సృష్టించిన కాంగ్రెస్ అసమర్థతను ప్రజల్లో ఎండగడుతామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజలాల వినియోగంలో తెలంగాణకు పెద్దఎత్తున అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని గుర్తు చేశారు. కరువు ప్రాంతమైన పాలమూరు జిల్లాకు తలాపున కృష్ణానది ప్రవహిస్తున్నా సాగునీరు అందక లక్షలాది ఎకరాల్లో పల్లెర్లు మొలిచాయని చెప్పారు. కరువును పారదోలేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం చేపడితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం కృష్ణా జలాలపై హక్కులను కేంద్రానికి కట్టబెడుతుందని ఆరోపించారు.
2021లో కేంద్రం ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునేందుకు గెజిట్ జారీ చేసిందని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించాలని ఒత్తిడి పెంచగా దీనికి కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. రాష్ర్టానికి జరిగిన అన్యాయాన్ని ప్రతిక్షణం గుర్తు చేస్తూ కేంద్రాన్ని కట్టడి చేశారన్నారు. ప్రాజెక్టులను అప్పగిస్తే కీలకమైన విద్యుత్ ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్ లెక్కలేనంత నీరు తరలించుకు పోతుంటే ఇక్కడి కృష్ణాబేసిన్‌లో ఉన్న పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఎండిపోతున్నాయన్నారు. గత కాంగ్రెస్ హయాంలోనే పోతిరెడ్డిపాడుకు బొక్కపెట్టారన్నారు. తిరిగి ఇప్పుడు కూడా పాత పద్ధతిని కాంగ్రెస్ అవలంభిస్తుందని దీన్ని ఎండగడుతామన్నారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు అతిపెద్ద కష్టం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్న జూరాల జలాశయం కింద అతి తక్కువ ఆయకట్టుకు సాగునీరు అందుతుందని చెప్పారు. మరోసారి కృష్ణాజలాలపై హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కృష్ణాజలాల రక్షణ, తెలంగాణ హక్కులకు కేసీఆర్ ఒక్కరే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు.