కొల్లాపూర్, జూలై 8 : అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు గుర్తుకు తెచ్చుకొని ఏడ్చినట్లు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. కృష్ణానదికి వరద వచ్చిన నెల రోజులకు శ్రీశైలం గేట్లు ఎత్తిన తర్వాత కూడా కృష్ణానది నీళ్లను లిఫ్ట్ చేయకపోతే రైతుల నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడి హడావిడిగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్ మంత్రులను వెంటబెట్టుకొని మంగళవారం ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. ముఖ్యంగా రేగుమాన్ గడ్డ వద్దనున్న ఎంజీకేఎల్ఐ వద్ద అనాధికార డ్రామా నడిచింది.
అధికార పార్టీలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యం గురించి మాట్లాడుతూ సొంత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎంజీకేఎల్ఐ సాగు ఆయకట్టును 13వేల ఎకరాల నుంచి 4.60 లక్షలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెరిగినట్లు అంగీకరించారు. ఎంజీకేఎల్ఐ కాల్వల్లో నీటి ప్రవాహం సామర్థ్యం పెంచలేదని, ఐదు మోటర్లలో రెండు మోటర్లు పని చేయడం లేదని విమర్శలు చేశారు. ఎంజీకేఎల్ఐ పనులు జరుగుతుప్పుడు నాటి అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి కమీషన్ల కోసం కాల్వ సామర్థ్యం పెంచలేదని ఆరోపణ కొల్లాపూర్ ప్రాంతంలో బలంగా ఉన్నది. కాల్వ ఎత్తు ఐదు మీటర్లు, వెడల్పు 19 మీటర్లు ఉండడంతో రెండు మోటర్లు ఆన్ చేస్తే కాల్వలు తెగిపోయే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
అలాగే ఎంజీకేఎల్ఐ ఐదు మోటర్లల్లో రెండు మోటర్లు కాలిపోయినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. ఆ రెండు మోటర్లు కాలిపోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి జూపల్లి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తెలంగాణపై కుట్ర జరిగిందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. ఎంజీకేఎల్కి రేగుమాన్ గడ్డ నుంచి వున్న అప్రో చ్ కెనాల్‌కు టన్నెల్ వద్ద షెట్టర్ లేకపోవడంతో ఎంజీకెఎల్ఐ పంప్ హౌస్ పూర్తిగా మునిగిపోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఆశపడకుండా ఉంటే రెండు మోటర్లు కాలిపోయేవి కావు అని ఇప్పటికి సాగు నీటిరంగ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.
తెలంగాణ ప్రాజెక్టులను కాలయాపనతో నిర్లక్ష్యంతో నాశనం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ లో అప్పుడు ఇప్పుడు మంత్రిగా వున్న జూపల్లి కృష్ణారావు నేడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ప్రా ధ్యాన్యం ఇచ్చారు తప్పితే కృష్ణానదికి వరద వచ్చి నెల రోజులు అవుతున్నా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల ద్వారా కృష్ణానది నీళ్లను కొల్లగొట్టిన తర్వాత కూడా ఎంజీకెఎల్ఐ మోటర్లు ఆన్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేశారో సమాధానం చెప్పలేకపోయా రు. ఎంజీకేఎల్ఐ కింద ఆలస్యంగా సాగు నీరు విడుదల చేయడంతో సాగు కూడా ఆలస్యం అవుతోంది. దీంతో ఆయకట్టు కింద దిగుబడి భారీగా తగ్గిపోయే ప్రమాదం నెలకొన్నది.
కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరదలు జూన్ నెల మొదటి వారంలోనే ప్రారంభమయ్యాయి. అనాటి నుంచి కృష్ణానది బేసిన్‌పై వున్న ప్రాజెక్టుల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తువస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కన్నుసన్నల్లో నడవడంతో కృష్ణానదిలో తెలంగాణ వాటాను వాడుకోవడంలో నిర్లక్ష్యం వహించింది. తెలంగాణ ప్రాజెక్టులపై జరుగుతున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ ప్రజెంటేషన్ ద్వారా లెక్కలతో సహా తెలంగాణ ప్రజానీకం ముందు పెట్టడంతో కాంగ్రెస్ సర్కార్ ఇరకాటంలో పడింది.
అంతేకాదు ఎంజీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేయకుంటే దండయాత్ర చేస్తామని హరీశ్‌రావు హెచ్చరించడంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార ప్రకటన చేయకుండానే ఎంజీకేఎల్ నుంచి సాగు నీరు విడుదల చేశారు. అయితే శ్రీశైలంలో సైతం గేట్లు ఎత్తిన ఎంజీకేఎల్ఐ నుంచి నీళ్లను లిఫ్ట్ చేకపోతే రై తుల నుంచి తిరుగుబాటు తప్పదని భావించి తప్పని పరిస్థితిలో ఎం జీకేఎల్ఐ మోటర్లను ఆన్ చేశారు. అయితే ఎంజీకేఎల్ఐ మాదిరిగా అ న్ని ప్రాజెక్టులకు కూడా నీటిని వి డుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమా ండ్ చేస్తున్నారు.
కృష్ణానది నీళ్లను ఆంధ్ర ప్రాజెక్టుల ద్వారా కొల్లగొట్టిన తర్వాత కూడా ఎంజీకేఎల్ఐ మోటర్లను ఎందుకు ఆన్ చేయలేదో ప్రభుత్వం రైతులకు సమాధానం చెప్పాలి. ఎంజీకేఎల్ కాల్వ సామర్థ్యం తక్కువగా ఉండటానికి, మోటర్లు కాలిపోవడానికి అప్పటి ప్రజాప్రతినిధి కమీషన్లకు కక్కుర్తి పడడమే కారణం. ఇప్పుడు బట్ట కాల్చి ఎదుటివారి మీద వేయడం సరైనది కాదనే విషయం మంత్రి తెలుసుకోవాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొల్లాపూర్
ఎంజీకేఎల్ఐ కాలువ కింద నాకు 20 గుంటల భూమి ఉన్నది. ఒక పది రోజుల ముందు కాల్వకు నీళ్లను వదిలి ఉంటే తుకాలు పోసుకునేవాళ్లం. ఇప్పుడు నీళ్లను వదలడంతో వరి పంట చేతికి వచ్చే సమయానికి గాలులు, వానలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పంట దిగుబడి దెబ్బతింటుంది. వరి పంట పొట్ట దశలో వున్నప్పుడు కాల్వలో నీళ్ల లేకపోతే పంట చేతి రాదు.
– మీనిగ సత్యం, రైతు, కుడికిళ్ల