తాడూరు, మార్చి 18 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఇసుక కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక కొరత తీర్చేందుకుగాను తాడూరు మండలంలోని ఏటిదర్పల్లి గ్రామ సమీపంలో దుందుభీ నదిలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం రచ్చకట్ట వద్ద సమావేశం అయ్యారు. ఈ క్రమంలో సమావేశానికి రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌శాఖల అధికారులు హాజరై ఇసుక రీచ్ ఏర్పాటుకు సహకరించాలని రైతులు, గ్రామస్తులకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు మాత్రం ఇసుక రీచ్ ఏర్పాటు చేస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ హెచ్చరించారు.
అంతేకాదు కొంత మంది మహిళలు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని అధికారుల ముందుకు రావడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అంతలోనే పోలీసులు కలుగజేసుకొని మీ అనుమతి లేకుండా ఇసుకను తరలించమని చెప్పడంతో సమస్య కాస్త సద్దుమణిగింది. అనంతరం గ్రామస్తులందరూ పెద్దల మనుషుల సమక్షంలో మా ఊరికి సంబంధించి దుందుభీ నదిలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయకూడదంటూ తీర్మానం చేసి ఆ తీర్మానం కాఫీని ఆర్ఐ సమీర్, సురేశ్, మైనింగ్ శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దుందుభీ నదిలో నుంచి ఇసుక తీసినట్లయితే భూగర్భ జలాలు తగ్గి బోర్లు పాడై సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. కావున ఉన్నతాధికారులు స్పందించి మా ఊర్లో ఇసుక రీచ్న ఏర్పాటు చేయవద్దని కోరారు. ఇసుక రీచ్‌కు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు తెలిపారు.