వనపర్తి, నవంబర్ 13: వనపర్తి అంటేనే విద్యకు మారుపేరుగా విద్యాపర్తిగా ఇక్కడి ప్రజలు పిలుచుకుంటారు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను కనబరుస్తూ విద్యాహబ్‌గా మారిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జిల్లా ఏర్పాటు కావడం వెంటనే జిల్లా కార్యాలయాలూ వచ్చాయి. మెడికల్ కళాశాల వస్తే జిల్లాకే తలమానికం అవుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో ముఖ్యమంత్రితో చర్చించి మంత్రి నిరంజన్‌రెడ్డి మెడికల్ కళాశాలను వనపర్తికి తీసుకురావడం జరిగింది.
మెడికల్ హబ్‌గా మారనున్న వనపర్తి
రానున్న రోజుల్లో వనపర్తి జిల్లా మెడికల్ హబ్‌గా మారనున్నది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాసపురంలో మెడికల్ కళాశాల కోసం 50ఎకరాల్లో 11నెలల్లో కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది నుంచి వైద్య విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే మెడికల్ కౌన్సెలింగ్ జరుగుతున్న నేపథ్యంలో తొలివిడుత సీట్లు సాధించిన విద్యార్థులు ప్రవేశాలను పొందుతున్నారు. మొదటి సంవత్సరంలో అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో విద్యాభోధనకు ఏర్పాట్లను పూర్తి చేశారు. బాలుర కోసం నాగవరం తండా సమీపంలోని వైటీసీ బిల్డింగ్‌లో, బాలికల కోసం నాగవరం సమీపంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఏర్పాట్లు చేశారు.
ప్రారంభమైన అడ్మిషన్లు
మెడికల్ కళాశాలలో తొలి ఏడాదికి 150 సీట్లను కేటాయించారు. ఇందులో జాతీయ స్థాయిలో 15 శాతం (22 సీట్లు), రాష్ట్ర స్థాయిలో 85శాతం (128) కోటాగా నిర్ణయించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. జాతీయ స్థాయి కోటాలో 22 సీట్లలో నాలుగు అడ్మిషన్లు పొందగా, రాష్ట్ర స్థాయిలో 128 సీట్లకుగానూ వివిధ జిల్లాల నుంచి 28 మంది అడ్మిషన్ల కోసం రిపోర్ట్ చేశారు. కళాశాలలో విద్యను అందించేందుకు ప్రత్యేక గదులు, ల్యాబ్స్, లైబ్రరీ, ప్రయోగశాలలు సైతం ఏర్పాటు చేయగా ఇప్పటికే కళాశాల తరగతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యం
మెడికల్ కళాశాల రాకతో జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందనున్నది. చిన్న చిన్న జబ్బులకు మాత్రమే చికిత్స చేస్తూ సీరియస్ కేసులను గతంలో కర్నూల్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలకు రెఫర్ చేశారు. మెడికల్ కళాశాల రాకతో గాంధీ, నిమ్స్ తరహాలో వైద్య సేవలు అందనున్నాయి.
కల నెరవేరుతున్నది
గతంలో హైదరాబాద్ వంటి మహానగరాల్లో మాత్రమే మెడికల్ కళాశాల ఉండేది. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జిల్లాలో మెడికల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెడికల్ కళాశాలలు రావడం వల్ల గ్రామీణ ప్రాంతంలో గల విద్యార్థులు మెడిసిన్ రాసి సీట్లు సాధించుకుంటే డాక్టర్ కావాలన్న కల నెరవేరుతున్నది. మెరుగైన వైద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్యాన్ని అందిపుచ్చుకోవచ్చు.
ఇప్పటికే అడ్మిషన్లు సైతం జరుగుతున్నాయి.
– సునందని, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి