ఆత్మకూరు, నవంబర్ 18 : కార్తీకం హిందువులకు పవిత్రమాసం. సౌభాగ్యాలు కలగాలని కోరుతూ కార్తీక పౌర్ణ మి వేళ మహిళలు పూజలు, నోములు, వ్రతాలు భక్తిశ్రద్ధల తో నిర్వహిస్తుంటారు. మనిషి పతనానికి హేతువులైన అరిషడ్వర్గాలను జయించేందుకు గోధుమపిండితో ఆరు ప్రమిదలను చేసి నెయ్యితో వెలిగిస్తారు. సకల శాంతి, సౌభాగ్యాల కోసం ధాత్రి నారాయణ, తులసీ కల్యాణం నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులకు ప్రీతికరంగా కేదారీశ్వర నోములు, సత్యనారాయణ, తులసీదామోదర కల్యాణాలు చేస్తారు. తులసికోట వద్ద ఉసిరికొమ్మను ఉంచి రాధాకృష్ణులను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం, జాగరణ, నదీస్నానం, సాల గ్రామదానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలు, జ్వాలాతోరణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. సకల శుభాలు కలుగాలని కోరుతూ సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని శివాలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ఆయా ఆలయాల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు శివాలయాలను ప్రత్యేక వి ద్యుద్దీపాలతో అలంకరించారు. ఆత్మకూరు బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయం కార్తీకపౌర్ణమి వేడుకలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్తీ క పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులతోపాటు రుద్రాభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సాయంత్రం లక్షదీపార్చన, జ్వాలాతోరణం కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక నీలకంఠేశ్వరస్వామి ఆలయం, చెరువులోని పరమేశ్వరస్వామి ఆలయం, మల్లాపురం ఆంజనేయస్వామి ఆలయం, హనుమాన్‌నగర్‌లోని స్ఫటిక లింగేశ్వరస్వామి ఆలయాలు ముస్తాబయ్యాయి. వైష్ణవ ఆలయాలతోపాటు, స్థానిక షిర్డీసాయిబాబా మందిరంలో కార్తీకపౌర్ణమి ప్రత్యేక వేడుకలకు సిద్ధం చేశారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేశారు.