వనపర్తి రూరల్, జూలై5: ప్రాజెక్టులతో సాగుకు స్వర్ణయుగం వచ్చిందని, ఒకప్పడు సాగు చేయడానికి నీళ్లు లేక కరువుతాండవించిన ఈ ప్రాంతం ఇప్పడు సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా పరిధిలోని అచ్యుతాపురంలో పల్లె నిద్రలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ అమలుపర్చుతున్న పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. నాడు వ్యవసాయాన్ని దండుగ అన్న పాలకులకు నేడు పండుగ అని నిరూపించిన కార్యదక్షుడు కేసీఆర్ అని కొనియాడారు. పల్లె, పట్టణ ప్రగతితో ఊళ్లకు కొత్తదనం వచ్చిందన్నారు. అనంతరం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సర్పంచ్ శారద ఆధ్వర్యంలో 100 మంది మంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. గ్రామ శివారులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి పల్లెనిద్రచేశారు. ప్లాస్టిక్ రహిత, పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు, చెక్‌డ్యాం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు, పేదలకు 25డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ ఏడాది మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, సర్పంచ్ శారద, సహకార సంఘం చైర్మన్లు వెంకట్రావ్, మధుసూదన్‌రెడ్డి, విజయ్‌కుమార్, వైస్‌చైర్మన్ శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, పాపిరెడ్డి, ఆశన్ననాయుడు, మాణిక్యం, వెంకటేశ్, రవికుమార్ పాల్గొన్నారు.