వనపర్తి రూరల్/కొత్తకోట/ఎర్రవల్లి చౌరస్తా, జూలై 2 : చెక్‌డ్యాంల నిర్మాణాలతో భూగర్భజలాలు పెంపొందుతున్నాయని సీఎం ఓఎస్టీ స్మితా సబర్వాల్, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. ఎక్కడెక్కడ చెక్‌డ్యాంలు నిర్మించాలో.. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. శుక్రవారం వనపర్తి మండలంలోని పడమటి తండాలో నిర్మించిన చెక్‌డ్యాంను కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషాతో కలిసి పరిశీలించారు. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలను పరిశీలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామసభలో వారు మాట్లాడారు. వనపర్తి జిల్లాలో మంజూరైన ఐదు చెక్‌డ్యాంలు పూర్తయినందున కాంట్రాక్టర్ శ్రీనువాసులును అభినందించారు.
ఎవరో వచ్చి ఊరును బాగు చేస్తారనే భావన వీడాలని, మన పల్లెను మనమే బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో బలహీనంగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలు నిర్మించుకున్నామని, మరింత అభివృద్ధి సాధించేందుకు మరో అడుగు ముందుకు వేయాలన్నారు. కోదండాపూర్ గ్రామంలో ఉన్న విధంగా తెలంగాణలో ఎక్కడా పల్లెప్రకృతివనం లేదన్నారు. కేరళలో ఉన్న అనుభూతినిస్తున్నదన్నారు. గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఐదేండ్లలోపు చిన్నారులను గుర్తించి మంచి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.
పింఛన్లు, రేషన్‌కార్డు, సదరం క్యాంపు, ఏమైనా సమస్యలు ఉంటే కలెక్టర్లను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను విద్యుత్‌శాఖ అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్‌యాస్మిన్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో 247 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయని, 27లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆయా కార్యక్రమాల్లో వనపర్తి, జోగుళాంబ గద్వాల కలెక్టర్లు షేక్ యాస్మిన్‌బాషా, శృతిఓఝా, అదనపు కలెక్టర్లు అంకిత్, శ్రీహర్ష, ఎస్ఈ సత్యశీలరెడ్డి, సీఈ రఘునాథ్‌రావు, ఎగ్జిక్యూటివ్ ఈఈ మధుసూదన్‌రావు, జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యరాజన్, కొత్తకోట ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కౌన్సిలర్లు రామ్మోహన్‌రెడ్డి, తిరుపతయ్య, అయ్యన్న, రాములుయాదవ్, రవీందర్‌రెడ్డి, ఖాజమైనొద్దీన్, కొండారెడ్డి, కోఆప్షన్ సభ్యులు వసీంఖాన్, వహిద్ తదితరులు పాల్గొన్నారు.