మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దోమలపెంట, ఫిబ్రవరి 25 : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రమాదం జరిగిన సొరంగంలోని 14వ కిలోమీటర్ సమీపంలో 40 మీటర్ల దగ్గరే ఆగిపోతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ సవాల్‌గా మారింది. దేశంలోని అత్యుత్తమ(11) బృందాలు గాలిస్తున్నా ఇంకా ఫలితం కనుచూపు మేరలో కనిపించడం లేదు. దీంతో మంగళవారం సహాయక చర్యల్లో పాల్గొన్న బృందాలు వెనక్కి వచ్చాయి. ఉత్తరాఖండ్‌కు చెందిన ర్యాట్ హోల్ మైనర్ టీంను రంగంలోకి దింపారు. ఈ టీంతోపాటు భారత నేవీ దళానికి చెందిన ప్రత్యేక బృందం కూడా ఉంది.
వీరితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కు చెందిన బృందాలు కూడా గాలించడానికి సొరంగంలోకి వెళ్లాయి. పోలీస్ జాగిలాలను కూడా పంపించారు. ఉదయం 10 గంటలకు లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ లోపలికి వెళ్లిన ఈ బృందాలు సాయంత్రం 7 గంటలకు తిరిగి వచ్చాయి. అయితే అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నందువల్ల రెస్క్యూ ఆపరేషన్ కష్టసాధ్యంగా మారిందని వెల్లడించాయి. సహాయక చర్యలకు ఏమాత్రం అణువుగా లేవని ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర విపత్తు నిర్వహణ సెక్రటరీ అరవింద్‌కుమార్ ప్రభుత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
అనంతరం వీరిని లోపలికి పంపించారు. ప్రమాదం జరిగిన చోట నీటిఊట మరింత పెరిగిందని నిమిషానికి 5,000 లీటర్ల నీరు ఉబికి వస్తుందని గుర్తించారు. రెండ్రోజుల కన్నా ఇప్పుడు మరింత పెరిగిందని గుర్తించారు. 8 మంది చిక్కుకున్న ప్రదేశంలో సుమారు 5 మీటర్ల బురద ఉందని అంచనా వేశారు. ఈ బురదలో కాళ్లు పెడితే లోపలికి జారే అవకాశం ఉన్నందునా రెస్క్యూ టీం అడుగు ముందుకు వేయలేదు. సొరంగంలోపల విద్యుత్ పునరుద్ధరించే అవకాశాలు లేకపోవడంతో వెంట జనరేటర్లను, టార్చ్ లైట్లను తీసుకువెళ్లారు.
ప్రమాదం జరిగిన చోటు గుర్తించి అక్కడ శిథిలాల తొలగింపు పూర్తయితే తప్పా పరిస్థితి ఏమిటన్నది అంచనా వేయలేమని రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్న బృందం సభ్యులు అంటున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద సంఘటన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సందర్శించారు.
అనంతరం బేస్ క్యాంపులో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సహాయ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణా శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరాఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐజీ చౌహాన్, టన్నెల్ రంగ నిపుణులు క్రిస్ కూపర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధి గ్రేన్ మేకర్డ్, ఉత్తరాఖండ్‌లో ఇలాంటి దుర్ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణుల బృందం, ఆర్మీ, నేవీ అధికారులు పాల్గొన్నారు.
సొరంగంలో నీటి ఊటకి సంబంధించి నేషనల్ జియోగ్రాఫిక్ సర్వే ఏజెన్సీ క్షుణ్ణంగా లోపలికి వెళ్లి పరిశీలించింది. అంతేకాకుండా 14వ కిలోమీటర్ల వద్ద ఉన్న గుట్టను పూర్తిగా పరిశీలించారు. పై భాగంలో పెద్ద ఎత్తున జలరాశి ఉన్నదని, దీంతో సొరంగంలోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయని తేల్చారు. పైనుంచి ఏ మాత్రం సొరంగంలోకి వెళ్లే అవకాశం లేదని.. అలా అయితే సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉందని నివేదిక ఇచ్చారు. సొరంగంలోపల కూడా చుట్టుపక్కల లైనింగ్ నుంచి కూడా నీటి ధార వస్తోందని.. ఇది కూడా సొరంగానికి ప్రమాదకర స్థాయిలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్లడానికి అవకాశం లేకుండా పో యిందని చెబుతున్నారు.
దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న నలుగురు కార్మికుల బంధువులను అక్కడి ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు పంపించింది. జార్ఖండ్‌కు చెందిన మైనింగ్ ఆఫీసర్ అవినాశ్ వెంట ఇక్కడికి చేరుకున్నారు. ఈ బృందం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్‌ను కలిసింది. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను కార్మికుల బంధువులకు వివరించింది. నాలుగు రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను బంధువులకు వివరించారు. ప్రమాదానికి ఒకరోజు ముందే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు జార్ఖండ్ మైనిం గ్ ఆఫీసర్ అవినాశ్ తెలిపారు.