కోడేరు, జూలై 15 : మండల పరిధిలోని లక్ష్మాపూర్ (లచ్చాపురం) గ్రామం కాలగర్భంలో కలవడంతో ఊరు పోయి పేరు మాత్రమే మిగిలింది. ఒకప్పుడు సుభిక్షంగా ఉన్న గ్రామం నేడు కనుమరుగైంది. ప్రస్తుతం పూర్వీకులు వాడిన వస్తువులు, ఇండ్ల పునాదులు, బండరాళ్లు పేర్చి నిర్మించుకున్న ఆంజనేయస్వామి ఆలయం, చెట్టు కింద కాళ్లతో ఏర్పాటు చేసుకున్న లచ్చమ్మ ఆలయం మాత్రమే ఆనవాళ్లుగా ఉన్నాయి. కోడేరుకు కేవలం 5కిలోమీటర్ల దూరంలో, కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కనే వంద ఏండ్ల కిందట లక్ష్మాపూర్ (లచ్చాపురం) గ్రామం ఉండేది. సుమారు 50 కుటుంబాలు(200 జనాభా) నివసించేవి. ఎలాంటి వైద్య, విద్యా సదుపాయాలు ఆ గ్రామంలో ఉండేవి కాదు. ఒకానొక సందర్భంలో అంటువ్యాధులు ప్రబలడంతో వైద్యం అందక కొందరు మృతిచెందగా.. మరికొందరు అనారోగ్యం బారిన పడ్డారు. ప్రతి ఏటా కొందరు అనారోగ్యానికి గురి కాగా అందులో కొంతమంది మరణించేవారు. దీనికి తోడు గ్రామానికి సమీపంలో రెండువేల అడుగుల ఎత్తున ఉన్న ఎత్తం గట్టు నీడ సాయంత్రం ఈ ఊరి మీద పడుతుండడం వల్లనే అరిష్టం పట్టుకొందని ప్రచారం జరుగడంతో ప్రజలు గ్రామాన్ని వదిలేశారు. మహాసముద్రం, కల్వకోలు, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామాలకు వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పూర్వీకులు నివాసం ఉన్న ఇండ్ల గోడలు, పునాదులు, ఆంజనేయస్వామి ఆలయం దర్శనమిస్తున్నాయి.
ఇప్పటికీ ఊరి పేరు సుపరిచితమే..
మండలకేంద్రానికి సమీపంలో ఉన్న లక్ష్మాపూర్ గ్రామం కనుమరుగయినా ఊరి పేరు మాత్రం ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. కోడేరుకు చెందిన రైతులు కూలీలను పిలిచేందుకు లక్ష్మాపూర్‌లో పనులకు వస్తారా అనే అడుగుతారు. ఇలా చెబితేనే కూలీలు సరిగ్గా పొలానికి చేరుకోగలుగుతారు. లక్ష్మాపూర్‌లో ప్రస్తుతం పూర్వీకులు వాడిన రోళ్లు, శిధిలమైన మట్టి వంట పాత్రలు, మట్టి మిద్దెల పునాదిరాళ్లు ఉన్నాయి. ప్రధానంగా రాళ్లు పేర్చి కట్టుకున్న ఆంజనేయస్వామి ఆలయం ఇప్పటికీ ఉన్నది. ప్రతి ఏటా కోడేరుకు ప్రజలు కొందరు స్వామివారికి పూజలు చేస్తారు. ఆలయ పరిసరాల పొలాల రైతులు సైతం వ్యవసాయ పనులు మొదలు పెట్టే సమయంతోపాటు కోతలు అయ్యి పంట ఇంటికొచ్చాక ఆంజనేయస్వామి, లచ్చమ్మ దేవతకు పూజలు చేస్తున్నారు.
నీడ పడుతుందని ఊరిని వదిలేశారు..
దాదాపు 150 ఏండ్ల కిందట లక్ష్మాపూర్ ఎత్తం గట్టుకు దగ్గరగా ఉండేది. దాని నీడ ఊరిపై పడి కీడు జరుగుతుందనే ప్రజలు మూఢ నమ్మకంతో గ్రామాన్ని వదిలేశారు. మహాసముద్రం, గంట్రావుపల్లి, కోడేరు వంటి గ్రామాలకు వెళ్లి తలదాచుకున్నారు. అప్పటి గుర్తులుగా ఆంజనేయస్వామి ఆలయం పాడుబడిన గోడలతో ఉంది. అప్పట్లో గ్రామంలో 50 ఇండ్లు ఉండేవని మా తాతల ద్వారా తెలుసుకున్నా. అటవీప్రాంతం కావటం వల్ల ఎలుగుబంట్లు, ఏదులు, తోడేళ్లు, నక్కలు వంటి అడవి జంతువులు ఎత్తం గట్టుపై నివాసం ఉండేవని చెప్పుకునేవారు. గట్టు కింది భాగంలో రామస్వామిబావి, చింతలబావి ఉండేవి. పూర్వీకులు తవ్విన ఈ బావుల్లోని నీటినే జంతువులు, లక్ష్మాపూర్ ప్రజలు తాగేవారు.
– డి.లక్ష్మారెడ్డి, కోడేరు