వనపర్తి, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : వనపర్తి విజయ పాలశీతలికరణ కేంద్రం నాడు ఉమ్మడి జిల్లాలోనే ఓ వెలుగు వెలిగింది. విజయ పాల పాకెట్లను సహితం ఈ కేంద్రం నుంచే ఉమ్మడి జిల్లా కేంద్రానికి పంపిణీ చేసిన చరిత్ర ఉంది. అయితే మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ విజయ డెయిరీని నిలబెట్టేందుకు గత ప్రభుత్వహయాంలో అనేక ప్రోత్సాహకాలను అందించింది. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయ డెయిరీని పట్టించుకోకపోవడంతో పాల సేకరణ అమాంతం పడిపోయింది. కలెక్టరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న వనపర్తి విజయ పాలశీతలీకరణ కేంద్రం దివాళా దిశగా అడుగులు వేస్తున్నది. వనపర్తి పాలశీలీకరణ కేంద్రానికి ప్రత్యేకత ఉంది.
ఉమ్మడి జిల్లాలోనే గతంలో అత్యధిక పాలసేకరణ చేసి అరుదైన రికార్డును సాధించింది. ప్రతిరోజూ పదివేల లీటర్ల పాలసేకరణ, ప్రతి నెలా క్రమం తప్పకుండా రైతులతో సమావేశాలు, నిత్యం సమీక్షలతో కళకళలాడిన ఈ విజయ డెయిరీ నేడు దివాళా దిశగా అడుగులు వేస్తున్నది. 1985లో ఏర్పాటైన ఈకేంద్రం 35ఏండ్ల్లపాటు రైతులకు బాసటగా నిలిచింది. అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తూ పాలసేకరణలో ముందుండేది. రైతులకు బ్యాంకు రుణాలు, పశుగ్రాసాలు, క్యాల్షి యం, దాణాలు తదితర వాటితో విరివిగా ప్రోత్సహించడంతో రైతులు కూడా పాడి రంగానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చారు.
ఉమ్మడి జిల్లాలోనే టాప్‌గా ఉన్న వనపర్తి విజయ డెయిరీకి ప్రస్తుతం 900లీటర్ల పాలు మాత్రమే రైతుల నుంచి రోజు వస్తున్నాయి. పది వేల లీటర్లకు పైగా సేకరణ చేసిన ఈ కేంద్రం పూర్తిగా రైతులకు దూరమైంది. రోజు వచ్చే పాల సేకరణను బట్టి కేంద్రం సేవలు రైతులకు ఎలా అందుతున్నాయో అర్థమవుతుంది. వేసవిలో పాలు తగ్గడం సహజమేనని సమర్థించుకున్నా.. నాటికి.. నేటికి అనేక వ్యత్యాసం గమనించిన వారికి తెలిసిపోతుంది. మార్చి నెలలోనే ఇలా ఉంటే, ముందు వచ్చే నెలలు మరింత కీలకంగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో రోజు వారి సేకరణ మరో 500లీటర్లకు పడిపోయినా ఆశ్యర్యం లేదు. ప్రస్తుతం పది గ్రామాల నుంచి 180 మంది రైతులు మాత్రమే విజయ డెయిరీకి పాలు విక్రయిస్తున్నారు.
పాడి రైతులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో పాలకు ప్రోత్సాహకాన్ని అందించింది. ఈమేరకు లీటరు పాలకు రూ.4 చొప్పున అదనంగా అందించి ఊరట కలిగించింది. గడిచిన రెండేళ్లుగా రైతులకు ఎలాంటి ఆదరణ లేకపోవడంతో విజయ డెయిరీని నమ్ముకున్న రైతులు వెనకబడుతున్నారు. ప్రైవేట్ కంపెనీల జోరు ఒక వైపు దూసుకువస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రోత్సాహకానికి అన్నదాతలు దూరం కావడం ఇబ్బందులను తెస్తుంది. ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి అందే ఇతర దాణా, పశుగ్రాస విత్తనాలు సహితం అంతంత మాత్రమే అందుతుండడంతో పాడి రైతులు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ పరిస్థితిలో ఉన్న లీటరు పాలకు ఇచ్చే ప్రోత్సాహకం కూడా ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ గోవింద చెప్పడంతో పాల సేకరణ పూర్తిగా తగ్గిపోయింది.
ప్రభుత్వ రంగ సంస్థ విజయ పాల శీతలీకరణ కేం ద్రం రైతులకు పాడి బిల్లులు చెల్లించడంలోనూ మీనమేషాలు లెక్కిస్తుంది. గతంలో 15 రోజులకు ఒకసారి చెల్లించే అవకాశం ఉండింది. అదే పద్ధతి నేటికీ కొనసాగుతున్నా బిల్లులు మాత్రం సక్రమంగా రాకపోవడంతో ఇంకాను విజయ డెయిరీని నమ్ముకున్న రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తు తం మూడు పాల బిల్లులు రైతులకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, ప్రైవేట్ పాడి సంస్థలు 10 రోజులకే బిల్లులు చెల్లిస్తున్నాయి. బిల్లులు సరైన సమయంలో అందజేయకపోయినా, అధికారుల ప్రోత్సాహకం ఇవ్వకపోయినా కొందరు రైతులు ఇప్పటికీ విజయ డెయిరీని ఆదరిస్తుండటం కొసమెరుపు.
వనపర్తి విజయ పాలశీతలీకరణ కేంద్రంపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఉమ్మడి పా లమూరు జిల్లా పరంగా ఒకే డీడీ పరిధిలో ఉన్న ఈ సంస్థలో రెం డు విభాగాలుగా చేశారు. దీంతో పర్యవేక్షణ ఇంకా గగనంగా మారింది. మహబూబ్‌నగర్-నాగర్‌కర్నూల్ జిల్లాల వారీగా డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయాలను గతేడాది ఆగస్టులో ఏర్పా టు చేశారు. ఇందులో వనపర్తిని నాగర్‌కర్నూల్ పరిధిలోకి చేర్చారు. అయితే, ప్రస్తుతం వనపర్తి కేంద్రానికి కల్వకుర్తిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి కృష్ణయ్యకు ఇన్చార్జి మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు.
అలాగే కల్వకుర్తిలో ఉండే మరో అధికారే డీడీగా వ్యవహరిస్తుండ టంతో ఇటు వైపు చూసే వారే లేరు. ఎప్పుడై నా జిల్లా స్థాయి మీటింగ్‌లు ఉండి విజయ డెయిరీ సంబంధ విషయాలుంటే తప్పా ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో ఈ కేంద్రం లో ఇద్దరు కాంట్రాక్ట్ ఫిల్డ్ సూపర్వైజర్లు, మరో ఇద్దరు కాం ట్రాక్ట్ క్లీనర్స్‌తో విజయ డెయిరీ కొనసాగుతున్నది. ఈ కార్యాలయం కలెక్టరేట్‌కు కేవలం కూత వేటు దూరంలోనే ఉన్నా.. ఇటు వైపు జిల్లా స్థాయి అధికారులెవరూ కన్నెత్తి చూడక పోవడం విచారకరం.