వసంతుడి వలపుగీతాలు.. కోకిలమ్మ కుహూరాగాలు.. మామిడాకుల మంగళనాదాలు.. పచ్చడి, షడ్రుచుల సమ్మేళనం.. శిశిరం అదృశ్యమవుతూ.. వసంతాగమన వేళ తెలుగు వారంతా ఇంటిల్లిపాది జరుపుకొనే కాలాలకు సంబంధించిన తొలి పండుగ.. తెలుగువారికి ఉగాది.. కన్నడిగులకు యుగాదిగా.. మహారాష్ట్రీయులకు గుడిఫడ్వాగా.. సిక్కులకు వైశాకిగా.. తమిళులకు ఉత్తాండుగా.. మళయాలీలకు విషుగా.. బెంగాళీలకు పోయిలాబైషాట్.. ఇలా ఆయా రాష్ర్టాల్లో ప్రజలు జరుపుకొనే పండుగ ఉగాది.. అంతటా ఒక్కటే భావన అదే ఆశావహ దృక్పథం, నిరాశా నిస్పృహలు విడనాడి శ్రీప్లవనామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఆశలతో భవిష్యత్ శ్రీశుభకృత్ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.. – గద్వాలటౌన్, ఏప్రిల్ 1
ఈ ఏడాది ఉగాది పండుగతో శ్రీశుభకృత నామ సంవత్సరం ఆరంభమవుతున్నది. దేశమంతటా నూతన శాఖలను అందించే పర్వదినమే ఈ ఉగాది. నిత్యావసరాల కోసం అందరూ ఇంగ్లిష్ క్యాలెండర్ను ఉపయోగిస్తున్నా హిందూ సంప్రదాయ ప్రకారం శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, ఉత్సవాలకు, పితృదేవతారాధనలకు తదితర పవిత్ర కార్యాలు, విశేషాలకు పంచాంగాన్నే వాడుతుంటారు. అలాంటి పంచాంగం ఉగాది పండుగతో అమలులోకి వస్తుంది. పంచాంగాన్ని ఉగాది రోజున దేవతలతోపాటు పూజించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. అదేవిధంగా పంచాంగ శ్రవణం ఉగాది విధుల్లో ఒకటి. గ్రామాలు మొదలుకొని పట్టణాలు, పెద్ద నగరాల్లో ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు తెలుసుకుంటారు. పండుగ పూట గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. రైతుల తొలి పండుగ ఉగాది రోజున దుక్కిదున్నితే ఆ ఏడాదంతా కలిసి వస్తుందనే భావనతో దుక్కులకు ముహూర్తాలు పెడుతారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఈ ఏడాది అంతా శుభమే కలగాలని కోరుకుంటారు.
సృష్టి ప్రారంభానికి బ్రహ్మదేవుడు నిర్ణయించిన సుమూహూర్తం ఉగాది అని చెబుతారు. యుగాల ప్రారంభానికి ఆదిగా నిలిచే వేడుక అయినందున కాలగమనంలో యుగాదే ఉగాదిగా రూపాంతరం చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఉగాది రోజున శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించాడని, శ్రీరాముడి కల్యాణోత్సవాలు కూడా ఉగాది నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. త్రేతా యుంగంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది కూడా ఉగాది రోజున కావడం విశేషం. అదేవిధంగా శకారాంభకుడు, శాలివాహనుడు కిరీటి దారులైంది కూడా ఉగాది నాడే. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవుల అగ్రజుడు ధర్మరాజు హస్తినాపురానికి రాజైంది ఉగాది రోజునే కావడం మరో విశేషం. అలాగే వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కరంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాఢ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడనేది మరో ప్రతీతి.
వాకిట్లో ధ్వజాన్ని నిలిపి దానికి చిగుళ్ల కొమ్మలు కడతారు. దీన్నే బ్రహ్మ ధ్వజమంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించడానికి గుర్తుగా దీన్ని ఆయా రాష్ర్టాల్లో ప్రజలు పండుగ పర్వదినాన వారి ముంగిళ్లలో నిలబెట్టేవారు. ఇప్పటికీ ఈ ఆచారాన్ని మహారాష్ట్ర ప్రజలు పాటించడం జరుగుతుంది.
పరిమళ పత్రమైన దవనం ఈ కాలంలో ఏపుగా పెరుగుతుంది. అందుకే ఈ పత్రంతో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణిమి వరకు బ్రహ్మదేవతలను పూజించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఇదేగాక ఈ పత్రం భూత బాధల నుంచి కాపాడడమే కాక శరీర దుర్గంధాన్ని కూడా హరిస్తుందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా దవనానికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉంది. దీంతో ఈ కాలంలో మల్లెలతోపాటు దవనాన్ని కూడా వాడి దండలుగా చేర్చి దేవతామూర్తులను అలంకరిస్తుంటారు. అలాగే మార్కెట్లో కూడా ఈ దవనం అందుబాటులో ఉండి తక్కువ ధరకు లభిస్తుంది. దీంతో మహిళలు పత్రాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పండుగకు మరో విశిష్టత ఉంది. అదే షడ్రుచుల ఉగాది పచ్చడి.
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకుంటారు. తద్వారా గంగస్నానం చేసినంత పుణ్యం పొందవచ్చునని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో పంటలు ఎలా పండుతాయి, ఏ పంటలు వేస్తే బాగుంటుందని పంచాంగం ద్వారా తెలుసుకొని సాగుచేసేవారు. ప్రస్తుతం కూడా కొంద రు రైతులు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రతి పండుగలో ఏదో ఒక వంటకం ప్రత్యేకంగా చేయడం తెలుగువారి సంప్రదాయం. అలంకరణలు, వంటకాలు ప్రతీది ఆనందోత్సవాలతో జరుపుకొంటారు. ముఖ్యంగా ఉగాది పండుగ రోజున షడ్రుచుల పచ్చడిని తయారు చేసి ఇంటిల్లిపాది సేవించడంతోపాటు ఆత్మీయులకు, అతిథులకు పంపిణీ చేస్తారు. పచ్చడి తయారీలో వేపపూత, పచ్చిమామిడి ముక్కలు, కొత్తచింతపండు, బెల్లం, ఉప్పు, కారం, మిరియాలు ఇలా దేనికదే ప్రత్యేకత కలిగి ఎన్నో రోగాలను నయం చేస్తాయి. ఆరు రుచులను కలిగే ఈ పదార్థాలను కొత్త కుండల్లో కలిపి నిల్వచేసి సేవించడం ఆనవాయితీ.
బెల్లం : తీపి, ఆనందానికి సంకేతం
ఉప్పు : జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు : చేదు, బాధకలింగించే అనుభవాలు
చింతపండు: పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చిమామిడి : వగరు కొత్త సవాళ్లు
కారం : సహనం కోల్పోయేలా చేసే పరిస్థితులు