లింగాల, జనవరి 23 : హైనా దాడిలో రెండు పెంపుడు కుక్కలు మృతి చెందిన ఘటన మండలంలోని అవుసలికుంట శివారులోని వ్యవసాయ పొలంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. అవుసలికుంటకు చెందిన బోయ బాలస్వామి పొలంలో వేరుశనగ పంటను సాగు చేశాడు. అడవి పందుల బెదడ తాళలేక కాపలాగా పెంపుడు కుక్కలను పొలంలో కట్టేసి ఇంటికి వెళ్లాడు.
తెల్లవారుజామున పొలానికి వచ్చి చూడగా, రెండు కుక్కలు చనిపోయాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, వారు పరిశీలించారు. కుక్కలపై హైనా దాడి చేసి చంపినట్లు నిర్ధారించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.