జడ్చర్లటౌన్, మార్చి11 : హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఓ ప్రయాణికురాలిని అర్ధరాత్రి వదిలి వెళ్లిన ఘటన శుక్రవారం జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసు కున్నది. జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు కథనం ప్రకారం చిత్తూర్ జిల్లా రేణిగుంటకు చెందిన పోపూరి రాణి(58) కొంత కాలంగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసముం టున్నది. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె తన కుమారుడు సందీప్‌తో కలసి హైదరాబాద్ నుంచి జయ మాతా ట్రావెల్స్ బస్సులో తిరుపతికి బయలుదేరింది. అర్ధ్ద రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు జడ్చర్ల శివారులోని మునావ ర్దాబా వద్ద ఆగింది. దీంతో సదరు మహిళ కాలకృత్యాల కోసం బస్సు దిగింది.
తిరిగి ఆమె బుస్సు ఎక్కలేదన్న విషయాన్ని గమనించకుండానే బస్సు డ్రైవర్ వెళ్లి పోయాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన ఆమె బస్సు కనిపించకపోవడంతో దాబా పరిసరాల్లో కొద్దిసేపు ఆగింది. ఎటు వెళ్లాలో తెలియక ఆమె జాతీయరహదారి పొడవునా కాలినడకతో జడ్చర్లకు చేరుకొని లారీలను లారీలను అపుతుండగా గుర్తించిన స్థానికులు వెంటనే పోలీ సులకు సమాచారం ఇచ్చారు. డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి నేతృత్వంలో పెట్రోలింగ్ చేస్తున్న జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు, ఎస్సై లెనిన్‌కు విషయం తెలపడంతో వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.
కొంత మానసిక పరిస్థితి బాగులేక సదరు మహిళ ఏ బస్సులో ప్రయాణీంచిన విషయం కూడా చెప్పలేని పరిస్థితి. ఆమె వద్ద సెల్‌ఫోన్ లేకపోవటంతో మహిళకు సంబందించిన వివరాలు తెలియలేదు. దీంతో పోలీసులే అప్రమత్తమై శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి బయల్దేరిన ట్రావెల్స్ బస్సుల వివరాలను ఆరా తీశారు. చివరకు జయ మాతా ట్రావెల్స్ బస్సులో సదరు మహిళ ప్రయాణించినట్లు గుర్తించి,సంబంధిత ట్రావెల్స్ బస్సు యాజమాన్యంతో మాట్లాడి బస్సు డ్రైవర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఆమె కుమారుడితో ఫోన్లో మాట్లాడి సదరు మహిళకు సంబందించిన సమాచారాన్ని అందించారు. అప్పటికే బస్సు కడపకు చేరటంతో సదరు మహిళను జడ్చర్లలోని బాలికల వసతిగృహంలో ఆశ్రయం కల్పించారు. శనివారం ఉదయం ఆమెను క్షేమంగా కుటుంబసభ్యులకు అప్పగించారు. సకాలంలో పోలీసులు స్పందించి మహిళను కాపాడినందుకు ఆమె కుటుంబసభ్యులు పోలీసులను అభినందించారు.