నాగర్‌కర్నూల్, డిసెంబర్ 22: అనాథ బాలికలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి పెళ్లీడుకు వచ్చాక ఇద్దరు యువతులకు వైభవంగా వివాహాలు జరిపించి అత్తారింటికి పంపించారు అనాథ ఆశ్రమ నిర్వాహకులు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా దగ్గర నెలకొల్పిన శ్రీజ్ఞానేశ్వర వాత్సల్య మందిరం(అరక్షిత అనాథ)లో అనాథలుగా చేరిన దీపిక, మల్లేశ్వరీలు పెళ్లీడుకు రావడంతో నిర్వాహకులు కుదిర్చిన దీపిక-సతీశ్‌రెడ్డి, మల్లేశ్వరి-కిరణ్‌కుమార్‌రెడ్డి పెండ్లివేడుక వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిపించారు. ఈ వివాహవేడుకకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్‌కుమార్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాసర్గౌడ్, ప్రముఖులు, అధికారులు శ్రేయోభిలాషులు ఆశ్రమ దాతలు, కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి వందలాలదిగా తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించడమే కాకుండా అనాథ ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో అరక్షిత బాలుర ఆశ్రమ నిర్వాహకుడు దొడ్ల నారాయణరెడ్డి, ఆలయ కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, పొలిశెట్టి లక్ష్మీశేఖర్, వరలక్ష్మి, దొడ్ల ఇందుమతి, వరలక్ష్మి, శ్యాంసుందర్, వీహెచ్‌పీ సభ్యులు, సత్యసాయి సేవా సమితి సభ్యులు, జ్ఞాన వికాస భారతి సభ్యులు, జ్ఞానేశ్వర్ వాత్సల్య మందిర్ కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు.