పెంట్లవెల్లి, జూన్ 23 : మండలంలోని జటప్రోల్ సమీపంలో ఉన్న వాటర్ ఫాల్స్‌కు పర్యాటకుల సందడి మొదలైంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల వారు, సోమశిలకు వచ్చిన పర్యాటకులు సైతం జటప్రోల్ వాటర్ ఫాల్స్‌ను సందర్శించి సందడిగా గడుపుతున్నారు. జటప్రోల్ సమీపంలోని కృష్ణానది తీరాన 400 ఏండ్ల కిందట సురభిరాజులు నిర్మించిన వంతెన ప్రస్తుతం వాటర్‌ఫాల్స్‌గా మారి పర్యాటకులను కనువిందు చేస్తున్నది. సమీపంలోనే శిల్పసంపదకు ప్రతి రూపమైన శ్రీ మదనగోపాలస్వామి ఆలయం, ఆ పక్కనే అగస్తేశ్వరస్వామి ఆలయం, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన మాసుంబాబా, హజ్రత్ దర్వేశ్ఖాద్రీ దర్గాలున్నాయి. అదేవిధంగా పర్యాటకులు బస చేయడానికి గ్రామంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్‌ను సైతం నిర్మించారు. జటప్రోల్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసి మెరుగైన వసతులు కల్పించాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.