కోస్గి, ఆగస్టు 17 : రోడ్దు ప్ర మాదంలో తీవ్రంగా గాయపడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు 108 బదులు ఓ తోపుడు బండిపై తరలించా రు. సుమారు అర కిలోమీటర్ మే ర మృతదేహాన్ని అందరూ చూస్తుండగానే తరలించడం పలు విమర్శలకు దారి తీసింది. ఇదంతా సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణ కేంద్రంలో చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలో ఓ టిప్పర్ ఢీకొని దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మొగులప్ప (28) అక్కడికక్కడే మృతి చెందాడు. 108కి ఫోన్ చేసినా అందుబాటులో లేకపోవడం తో మానవత్వం మంటకలిసేలా మృతదేహాన్ని ఓ తోపుడు బండిపై వేసుకొని శివాజీ చౌరస్తా నుంచి ప్రభుత్వ దవాఖాన వరకు పోలీసులే తీసుకెళ్లడం పట్టణమంతా చర్చకు దారి తీసింది.
ఆదివారం కోస్గి మార్కెట్ రద్దీగా ఉన్న సమయంలో మృతదేహాన్ని తరలించడా న్ని చాలా మంది తమ ఫోన్లలో రికార్డు చేసి ఘటనను సోషల్ మీడియాలో పంచుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పేదవాడి చావు పట్ల అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలాకాలో ఇలాంటి అమానవీయ ఘటన చోటు చేసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.