తిమ్మాజిపేట, మార్చి 30 : తిమ్మాజిపేట ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి ఏసీబీ వలలో చిక్కా రు. ఒక కేసులో వాహనాల విడుదల కోసం డబ్బులు తీసుకోవడంతో ఏసీబీ ఆధికారులు సోమవారం ఆయనను అరెస్ట్ చేశా రు. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాలను వెల్లడించారు. మరికల్ గ్రామంలో ఈనెల 5వ తేదీన ఇసుక (మ ట్టి) అక్రమ రవాణాకు సంబంధించి ఒక వ్యక్తికి చెందిన రెండు ట్రాక్టర్లు, జేసీబీని ఎస్సై సీజ్ చేసి స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిపై ఏడీ మైన్స్‌కు ఎస్సై లేఖ రాయడంతో మైనింగ్ అధికారులు ట్రాక్టర్లు, జేసీబీలపై రూ.60 వేల జరిమానా విధించినట్లు డీఎస్పీ తెలిపారు.
జరిమానా ఈనెల 7వ తేదీన చెల్లించిన వాహన యజమాని వాహనాల విడుదల పత్రాలు తీసుకొచ్చి ఎస్సైకి ఇవ్వగా, వాటిని విడుదలకు రూ.30వేలు చెల్లించాలని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు. దీంతో అతను ఎస్సైకి రూ.20వేలు ఇచ్చి, పూర్తి ఆధారాలతో తమను ఆశ్రయించగా దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించి వా రి అనుమతితో ఎస్సైపై కేసు నమోదు చేసి, ఎస్సైని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్సైకి డబ్బులు ఇచ్చినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఏసీబీ ఆధికారులకు ఎస్సై చిక్కాడన్న సమాచారంతో తిమ్మాజిపేటలో కొందరు సంబురాలు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద వివిధ గ్రామాలకు చెందిన యువకులు, వ్యక్తులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎస్సైకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.