నవాబ్‌పేట, జూన్ 3 : మండలంలోని దాయపంతులపల్లి గ్రామంలో సోమవారం అడవిపంది బీభత్సం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు దాయపంతులపల్లి గ్రామ శివారులోని దట్టమైన చెట్ల పొదల నుంచి సోమవారం ఉదయం ఒక అడవిపంది గ్రామంలోకి వచ్చింది. కన్పించిన మహిళలపై విచక్షణా రహితంగా దాడి చేసింది. ఏకంగా ఇండ్లలోకి చొరబడి గండు వెంకటమ్మ, చాకలి నర్సమ్మ, గొల్ల వెంకటమ్మ, చాకలి బుడ్డమ్మ, చెన్నమ్మపై కాళ్ల గోర్లు, నోటితో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులంతా వచ్చి పందిని బెదిరించడంతో గ్రామం నుంచి బయటకు వెళ్లి పోయింది. గాయపడ్డ మహిళలను గ్రామస్తులు 108 వాహనంలో జిల్లా దవాఖానకు తరలించారు.