మల్దకల్, మే 19 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలో గద్వాల-అయిజ రోడ్డుపై రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా ధా న్యం కొనుగోళ్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధం గా 15రోజుల కిందట కొనుగోలు చేసిన ధాన్యాన్ని సైతం నేటికీ మిల్లులకు తరలించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నాయని, దీని వల్ల అధికారులు ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాలని చెబుతున్నారని, ధాన్యం తరలించే వరకు రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని లేదంటే ఆందోళన విరమించే ప్రసక్తేలేదని భీస్మించుకు కూర్చున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో రైతులను మాట్లాడించడంతో రైతులు ఆందోళన విరమించారు.
ధాన్యం కొనుగోళ్ల విషయాన్ని పీఏసీసీఎస్ సీఈవో కిరణ్‌కుమార్‌రెడ్డిని వివరణ కోరగా సెంటర్లో 50మంది రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 20 వేల బ్యాగులు కాంటా వేసినట్లు చెప్పారు. 8వేల క్వింటాళ్ల ధాన్యాన్ని వారం రోజులు కిందట కొనుగోలు చేశామన్నారు. అయితే మిల్లులకు పంపించడానికి లారీల రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందన్నారు. రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న డీటీలు ఉదయ్‌కిరణ్, ప్రశాంత్‌గౌడ్ కొనుగోలు కేంద్రానికి వచ్చారని, వెంటనే రెండు లారీల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మిగతా వారిటిని కూడా త్వరలో మిల్లులకు తరలిస్తామని చెప్పారు.