మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 3 : తెలంగాణలో బీసీలను జనాభాను తక్కువచేసి చూపించడంలో కుట్ర దాగుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఓబీసీ నాయకుడు, బీపీ మండల్ మనుమడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్ ఆరోపించారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన హైదరాబాద్‌లోని సావిత్రీబాయి ఫూలే ఆడిటోరియంలో నిర్వహించే ఓబీసీ యూత్ లీడర్షిప్ సమ్మిట్ – 2025 పోస్టర్‌ను సోమవారం శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్, ఉత్తరప్రదేశ్, ఒడిశా మాజీ ఎంపీలు శ్యాంసింగ్యాదవ్, సస్మట్పాత్ర, ఆంధ్రప్రదేశ్ ఎంపీ మ స్తాన్రావుతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఓబీసీ డిమాండ్ల సాధనలో విద్యార్థులు భాగస్వాములై ఓబీసీ ఉద్యమానికి వెన్నెముకగా నిలవాలని పేర్కొన్నారు. ఓబీసీ విద్యార్థులకు విద్యా, ఉద్యోగం రిజర్వేషన్లల్లో జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలన్నారు. జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు చట్ట సభలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ల సాధనకు పాటుపడాలన్నారు. తెలంగాణలో ఓబీసీ జనాభా ఎంత అన్నది కచితంగా లెక్క చూపకపోవడం పలు అనుమానాలను తావిస్తుందన్నారు.
దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణన చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విద్యార్థులకు సూ చించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చే యాలని, లేదంటే అన్ని రాష్ర్టాల్లో ఓబీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే విధంగా కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆల్‌ఇండి యా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ ఓబీసీ యూత్ లీడర్షిప్ సమ్మిట్ వల్ల యువత వివిధ రంగాల్లోతో పాటు రాజకీయం, బ్యూరోక్రటిక్, వ్యాపార అకాడమీ, వృత్తి పరంగా సాంసృతిక రంగాల్లో రాణించి మార్గనిర్ధేశం చేయడానికి సమ్మిట్ – 2025 ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ ఓబీసీ నాయకులు సందీప్‌కుమార్, బనారస్ హిందూ యునివర్సిటీ ఓబీసీ నాయకులు కృష్ణకాంత, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.