అయిజ, మే 31 : పశువుల కొవ్వుతో గుట్టుచప్పుడు కాకుండా నూనె తయారుచేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఊరికి దూరంగా ఓ గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయించడంతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అయిజ పట్టణంలోని ఎస్సీకాలనీకి సమీపంలో కొందరు రేకులతో కూడిన గుడిసెను ఏర్పాటు చేసుకొని నూనెను తయారు చేస్తున్నారు. ప్రతి ఆదివారం పట్టణంలోకి వస్తున్న ఎద్దుల కొవ్వును గుడిసెకు తరలించి అక్కడే మంటపై కరిగించి నూనె తయారు చేస్తున్నట్లు కాలనీవాసులు గుర్తించారు. స్థానికంగా విక్రయించడంతోపాటు నాగల్‌దిన్నె వంతెన మీదుగా ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుడిసెలో నుంచి దుర్వాసన వస్తుండడంతో గ్రహించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడిసెను పరిశీలించి నూనె తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాలను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపించారు. ఇంతకాలం కొవ్వుతో తయారు చేసిన నూనెను ఎక్కడెక్కడ విక్రయించారనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తయారీదారులను పోలీసులు వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.