వనపర్తి రూరల్, ఏప్రిల్ 4: గొల్లకురుములు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో మొదటి విడుతలో యూనిట్‌కు రూ.1.25లక్షలుగా నిర్ణయించి దానిలో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలను 75శాతం సబ్సిడీతో అందించింది. లబ్ధిదారుడు తన వాటా కింద రూ.31,250 డీడీ చెల్లించగా ప్రభుత్వం రూ.93,750 సబ్సిడీ అందిచింది. మొదటి విడుతలో జిల్లాలో 13,890 యూనిట్లను రూ.175కోట్లతో లబ్ధిదారులకు అందజేసింది. అదేవిధంగా జీవాలకు సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్లు, మెడికల్ కిట్లు, ఫీడింగ్ను అందిస్తున్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం ఈసారి యూనిట్‌కు రూ.1.75లక్షలుగా నిర్ణయించింది. గతంలో యూనిట్‌కు రూ.1.25లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.1.75లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో రూ.31,250 కట్టాల్సిన డీడీని లబ్ధిదారులు ఇప్పుడు రూ.43,250 చెల్లించాలి. దీనికి ప్రభుత్వం రూ.1,31,750 సబ్సిడీ కింద చెల్లిస్తుంది. గతంలో డీడీ రూపంలో డబ్బులు చెల్లిస్తుండగా ప్రస్తుతం ఈ-లాబ్ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను రిజిస్టర్ చేస్తున్నారు.
జిల్లాలో రెండోవిడుత గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప క్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కలెక్టర్, మంత్రి ఆదేశాల మేరకు సాగుతున్నది. అదేవిధంగా గొ ర్రెల కొనుగోళ్లకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. తా జాగా గొర్రెల రవాణా కు సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో టెండర్ల ప్రక్రియ ప్రా రంభమైంది. ఏపీలోని గుంటూరు, రాయలసీమ, తి రుపతి, నెల్లూర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లోని గొర్రెలను ప్ర భుత్వం కొనుగోలు చేసి రవాణా చేయనున్నది. రెండో విడుతలో జిల్లాకు 11,961 యూనిట్లకు 2,51,181 గొర్రె, పొట్టేల్లను అందించేకు ప్రభుత్వం రూ.209కోట్లు ఖర్చు చేయనున్నది.
జీవాలకు ప్రతి ఏటా రెండు విడుతలుగా వ్యాక్సిన్లను ఉచితం అందిస్తున్నది. అదేవిధంగా మెడిసిన్ కిట్, ఫీడింగ్ అవకాశం కల్పిస్తున్నది. పంపిణీ చేసిన గొర్రెల చెవుల కు ట్యాగింగ్ చేసి, ఏదైనా కారణంతో అవి మరణిస్తే భీమా సౌకర్యంతో దాని స్థానంలో మరో గొర్రెను అందిస్తున్నది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చే గొర్రెల పిల్లలకు రవాణా చార్జీలను సైతం ప్రభుత్వమే భరిస్తున్నది.
రెండోవిడుత గొర్రెల పంపిణీని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే లబ్ధిదారుల వివరాలను మళ్లీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. జిల్లాలో మొత్తం 201 గొర్రెలపెంపకందారుల సహకారసంఘాలున్నాయి. వాటి అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన
వెంటనే కార్యాచరణ మొదలుపెడతాం.
– వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి, వనపర్తి జిల్లా