కల్వకుర్తి రూరల్, జూలై 15 : కల్వకుర్తి పట్టణంలోని సర్కారు దవాఖానలో ఐదారు నెలలుగా మందులు అరకొరగానే సరఫరా చేస్తున్నారు. మూ డు జాతీయ రహదారులకు అతి సమీపంగా ఉన్న ఈ దవాఖానలో వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ మందుల సరఫరా మాత్రం సక్రమంగా లేదు. ప్రతిని త్యం దాదాపుగా నాలుగు వందలకు పైగా రోగులు దవాఖానకు వస్తున్నప్పటికీ వారికి యాంటీ బయోటిక్స్ మందులు లేకపోవడంతో ఇటు రోగులు, అటు వైద్య సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. దవాఖానకు సాధారణ రోగులు, పాయిజన్ కేసులు, వాంతులు విరేచనాలు, జ్వరాలు, వంటి రోగాలకు వైద్యం కోసం వస్తుండడంతో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ అంది స్తూ సేవలందిస్తారు. రోగులకు అందించే వైద్య సేవల నిమిత్తం పరిస్థితుల మేరకు దవాఖాన ఎమర్జెన్సీ బడ్జెట్ ద్వారా అవసరమైన మందులను కొని తెచ్చుకుంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో బయటనుంచి తెప్పించుకోవాల్సి వస్తోందని రోగుల బంధువులు పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి కొన్ని రకాల మందులు ఉన్నప్పటికీ యాంటీ బయోటిక్స్ ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు మాత్రం సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్స్ సైప్లె) మహబూబ్‌నగర్ నుంచి సరఫరా కావడం లేదు. వీటితోపాటు ఓఆర్ఎస్, ఆర్ఎల్ ఫ్లూయిడ్స్, చిన్నపిల్లలకు అందించే సిరప్లు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. గత ప్రభుత్వం సర్కారు దవాఖానల అభివృద్ధికి మందుల సరఫరా ఎప్పటికప్పుడు అం దించి మెరుగైన వైద్యాన్ని అందిస్తే.. ప్రస్తుత ప్రభుత్వం మందులను కూడా సక్రమంగా అందించలేని దుస్థితిలో ఉన్నది. ప్రతినెలా అవసరమైన మందులను పంపించేందుకు సీడీఎస్‌కు ప్రతిపాదనలు పంపినా ప్రభు త్వం నుంచి సరఫరా లేకపోవడంతో అందించ లేకపోతున్నామని సిబ్బంది చెబుతున్నారు.