Peddi Movie | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో రాబోతున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ట్రైలర్, పాటలతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి మద్రాస్ హైకోర్టు ఒక కీలకమైన భారీ ఊరటనిచ్చే తీర్పును వెలువరించింది. సినిమాను పైరసీ భూతం నుండి రక్షించేందుకు కోర్టు అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ జారీ చేసింది.
సినిమా కాపీరైట్ హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను హైకోర్టు వెకేషన్ బెంచ్ సుదీర్ఘంగా విచారించింది. ఒకవేళ సినిమా విడుదలకు ముందో, లేదా విడుదలైన వెంటనేనో ఇంటర్నెట్లో అనధికారికంగా లీక్ అయితే నిర్మాతలకు భారీ ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లుతుందని న్యాయస్థానం ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ‘పెద్ది’ సినిమాను ఇంటర్నెట్లో అక్రమంగా అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, ప్రసారం చేయడం లేదా కాపీ చేయడం వంటి చర్యలను పూర్తిగా నిరోధిస్తూ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీని పైరసీ మహమ్మారి చాలా కాలంగా వేధిస్తోంది. ఇటీవల విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలకు ముందే ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడం చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలవరపెట్టింది. ఇలాంటి నష్టాలు ‘పెద్ది’ సినిమాకు రాకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ముందస్తుగా మేల్కొని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఇచ్చిన ఈ ‘డైనమిక్ ఇంజంక్షన్’ ఉత్తర్వుల ప్రకారం.. పైరసీదారులు ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే, మళ్లీ కొత్త యూఆర్ఎల్ (URL) లేదా కొత్త పేరుతో అదే కంటెంట్‌ను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించినా, ఆ కొత్త సైట్లు కూడా ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోతాయి. డిజిటల్ యుగంలో పైరసీని అడ్డుకోవడానికి ఇదొక అత్యుత్తమ న్యాయపరమైన రక్షణగా నిలువబోతుంది. ‘పెద్ది’ టీమ్ తీసుకున్న ఈ ముందస్తు చర్యను టాలీవుడ్ వర్గాలతో పాటు సినిమా విశ్లేషకులు, ప్రేక్షకులు సైతం ఎంతో అభినందిస్తున్నారు.