Siddaramaiah : కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ తన అధికారిక నివాసం ‘కావేరి’లో ఏర్పాటు చేసిన అల్పాహార విందు సమావేశంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గవర్నర్ ఇవాళ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ కార్యాలయమైన లోక్‌భవన్ (Lok Bhavan) కు తన రాజీనామా లేఖను పంపించారు. గవర్నర్ మధ్యప్రదేశ్ (Madhyapradesh) నుంచి తిరిగిరాగానే తన రాజీనామాను ఆమోదిస్తారని ఆయన అన్నారు. దాంతో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) తదుపరి సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లు తెలియగానే బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న డీకే శివకుమార్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. ఆయన మద్దతుదారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నినాదాలు చేస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. దాంతో ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టంచేశారు. క్యాబినెట్ సహచరులతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్య తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
తదుపరి సీఎంగా డీకే శివకుమార్‌ను నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తనకు సూచించిందని సిద్దరామయ్య మంత్రులకు తెలిపారు. ఈ ప్రకటన సమయంలో సిద్ధరామయ్య భావోద్వేగానికి గురయ్యారని తెలిసింది. ఇంతకాలం తాను చేసిన పనులపట్ల సంతృప్తిగా ఉన్నానని సిద్ధరామయ్య తన సహచరులతో అన్నట్లు తెలుస్తోంది.