నవాబ్‌పేట, ఫిబ్రవరి 13: మండలంలోని పుట్టోనిపల్లి తండా కు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని అనన్యను.. గుర్తు తెలియని మహిళ మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని, తల్లిదండ్రుల కథనం మేరకు.. పుట్టోనిపల్లి తండాకు చెందిన అనన్య గురువారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా గుర్తు తెలియని మహిళ అక్కడికి వచ్చింది. ఆమె అనన్య స్కూల్ బ్యాగు తీసుకెళ్తుండగా.. విద్యార్థిని వెళ్లి అడిగేలోపే చేయికి ఇంజక్షన్ ఇచ్చింది. విద్యార్థినికి మత్తు వస్తే కిడ్నాప్ చేద్దామని యత్నించింది. కానీ, ఈ విషయాన్ని తండావాసులు గమనించడంతో సదరు మహిళ స్కూల్ బ్యాగును అక్కడే పడేసి వెళ్లిపోయింది.
అనంతరం బాలిక ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురికావడంతో.. కుటుంబసభ్యులు ఆరా తీయగా విషయం చెప్పింది. శుక్రవారం విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో దవాఖానకు తరలించారు. నవాబ్‌పేట పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. కాగా, బాలికకు మత్తు ఇంజక్షన్ వేసిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది.