భూత్పూర్, ఆగస్టు 29 : దైవదర్శనానికి వెళ్లొస్తున్న వారిని మృత్యువు కబళించింది.. మహబూబ్నగర్ జిల్లాలోని హైవే-44పై ఘోర రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకున్నది. వివరాలిలా.. హైదరాబాద్లోని సైదాబాద్ పరిసరాల్లోని మాధన్నపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది కారు(టీఎస్ 07 హెచ్ఎక్స్ 5399)లో మూడ్రోజుల కిందట తిరుపతి వెంకన్న దర్శనానికి బయలుదేరారు.
అనంతరం తిరిగొస్తుండగా.. గురువారం ఉదయం భూత్పూరు మండలం తాటికొండ స్టేజీ సమీపంలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న డీసీఎం (ఎంఏ 40 వై 9758)ను వెనుక నుంచి వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఎల్అండ్టీ సిబ్బంది క్రేన్ సాయంతో కారులోంచి మృతదేహాలను బయటకు తీశారు. కారు డ్రైవర్ అశోక్ యాదవ్(45), గోనెల వెంకట రమణ(43), ఉరుసుల కెంపురావు(78) అక్కడికక్కడే మృతి చెందారు.
గాయపడ్డ వారిని ఎల్అండ్టీ సహకారంతో అంబుల్లెన్స్లో మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ ఉరుసుల వెంకట రామారావు (44) మృతి చెందాడు. అదేవిధంగా కారులో ఉన్న సువర్ణలక్ష్మి, అంబికకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు చిన్న పిల్లలు అక్షిత, శ్రేయ అగ్రణ్యకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా జాతీయ రహదారి పక్కన డీసీఎం డ్రైవర్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తగా వాహనాన్ని నిలిపినందుకే ప్రమాదం చోటు చేసుకున్నదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. రోడ్డుపై ఎక్కువ సమయం ట్రాఫిక్ నిల్వకుండా ఎల్అండ్టీ, ఎస్సై చర్యలు చేపట్టారు.