మహబూబ్‌నగర్ కలెక్టరేట్, అక్టోబర్ 15 : పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 16న గురువారం 4వ స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగో స్నాతకోత్సవం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ కళాశాలల ప్రాధానాచార్యులు, మేనేజ్మెంట్ సభ్యులు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వీక్షించేందుకు ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఇం డోర్ కాంప్లెక్స్ (క్రీడా భవనం)లో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి బోధన, బోధనేతర సిబ్బందితో కూడిన 7 కమిటీలు ఏర్పాటు చేశామని.. పండుగ వాతావరణంలో స్నాతకోత్సవం నిర్వహిస్తామని వైస్‌చాన్స్‌లర్ శ్రీనివాస్ తెలిపారు.
ఏడాదిన్నర తర్వాత..
4వ స్నాతకోత్సవాన్ని 2024 సంవత్సరంలోనే నిర్వహించాలని అప్పట్లో వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్‌రాథోడ్ నేతృత్వంలో నోటిఫికేషన్ జారీ చేశారు. బం గారు పతకాలు, యూజీ, పీజీ డిగ్రీల ప్రధానానికి అవసరమైన దరఖాస్తులు సైతం స్వీకరించారు. అనంతరం ఎన్నికల కోడ్, వైస్‌చాన్స్‌లర్ బదిలీ తదితర అనేక కారణాల వల్ల అప్పట్లో కాన్వకేషన్ నిర్వహించలేదు. ప్రస్తు తం అదే నోటిఫికేషన్‌కు అనుగుణంగా రెండోదఫా నోటిఫికేషన్ ఇస్తూ మరోసారి కొత్తవారికి అవకాశం కల్పిస్తూ బంగారు పతకాలు, డిగ్రీలకు దరఖాస్తులు ఆహ్వానించారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిన్నర తర్వాత 4వ స్నా తకోత్సవం నిర్వహిస్తుండటం గమనార్హం.
స్నాతకోత్సవాల నిర్వహణ ఇలా..
పీయూ మొట్టమొదటి స్నాతకోత్సవం 20 నవంబర్ 2014లో జరిగింది. ముఖ్య అతిథిగా బెంగళూరులోని నాక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏఎన్.రాయ్ హాజరై 56 మందికి బంగారు పతకాలు, 7,636 మందికి యూజీ, పీజీ డిగ్రీలు ప్రదానం చేశారు. రెండో స్నాతకోత్స వం 6 మార్చి 2019లో జరిగింది. ప్రధాన అతిథిగా చెన్నై విశ్వవిద్యాలయం పూర్వ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్పీ త్యాగరాజన్ హాజరయ్యారు. మొత్తం 115మందికి బంగారు పతకాలు, యూజీ, పీజీ డిగ్రీలు 14,675 ప్రదానం చేశారు. అనంతరం మూడో స్నాతకోత్సవం 24 నవంబర్ 2022లో జరిగింది. అప్పటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 6 పీహెచ్‌డీలు (కెమిస్ట్రీ విభాగంలో మూడు, ఇంగ్లిష్‌లో 2, మైక్రోబయాలజీ విభాగంలో ఒకరికి పీహెచ్‌డీతో పాటు 71మందికి బంగారు పతకాలు బహూకరించారు. 33,577 యూజీ, పీజీ డిగ్రీలు ప్రదానం చేశారు. నాలుగో స్నాతకోత్సవాన్ని గురువారం నిర్వహించనున్నారు.
గవర్నర్ పర్యటన ఇలా..
పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఈ నెల 16న ఉదయం 10:30 గంటలకు పీయూకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు, వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అనంతరం చాన్స్‌లర్, వైస్‌చాన్స్‌లర్, ముఖ్యఅతిథి, పాలక మండలి సభ్యులు, డీన్స్, రిజిస్ట్రార్, పరీక్షల నిర్వహణ అధికారులతో స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నాం 12:30గంటల వరకు యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. మధ్యాహ్నం 2:10 నుంచి 2:45గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, టీబీ నియంత్రణ అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం మధ్యా హ్నం 2:45గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ఆయన ముఖాముఖిలో పాల్గొంటారు.