గద్వాల : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ( KCR ) చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని గద్వాల బీఆర్ఎస్ నాయకులు బాస్ హనుమంతు నాయుడు ( Hanmanth Naidu) అన్నారు. విజయ్ దివస్ సందర్భంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి , కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, అమరవీరుల చిత్రపటం వద్ద నివాళులర్పించారు. జిల్లా దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమంతు నాయుడు మాట్లాడారు.
సబ్బండవర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం కదలి , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష చేపట్టకపోతే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ , నాయకులు నాగరిదొడ్డి వెంకట రాములు, కురువ పల్లయ్య , మోనేష్, అత్కూర్ రెహమాన్, శ్రీరాములు, రాజు, ఈశ్వర్, లక్ష్మి కాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.