నారాయణపేట, ఫిబ్రవరి 19 : దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడాలేని విధంగా 5వేల జనాభాకు ఓ దవాఖాన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లెదవాఖానలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గొప్పవరం. పల్లె దవాఖాన ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు త్వరితగతిన వైద్యసేవలందే అవకాశాలు ఉన్నాయి. పల్లె దవాఖానలో డాక్టర్లు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తున్నారు.
సరైన సమయానికి బస్సులు, ఆటోలు లేకపోవడంతో గతంలో సుదూరప్రాంతం ప్రయాణిస్తే తప్ప వైద్యసేవలు అందేవి కావు. సీజనల్, వాతావరణ మార్పులు వంటి జబ్బులకు డాక్టర్లు మందులిస్తున్నారు. అదేవిధంగా నార్మల్ డెలివరీ, కేసీఆర్‌కిట్, ప్రెగ్నెన్సీ కిట్, గర్భిణులకు రక్తహీనత లోపాలపై అవగాహన కల్పిస్తున్నారు. పీహెచ్‌సీల్లో జరిగే డెలివరీలు తప్ప మిగతా అన్ని రకాల వైద్యసేవలను సబ్‌సెంటర్ లెవల్లో అందిస్తున్నారు.
ప్రభుత్వం నారాయణపేట జిల్లాలో 64 పల్లె దవాఖానలను నెలకొల్పింది. ఇదివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధి లో ఉన్న 15సబ్ సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చారు. వీటితోపాటు కొత్తగా ఏర్పాటు చేసిన 49పల్లె దవాఖానలతో వీటి సం ఖ్య 64కు చేరింది. ప్రతి పల్లె దవాఖానలో డాక్టర్, నర్స్, ఫార్మాసిస్ట్, అటెండర్ ఉంటారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారిని అర్హతలనుబట్టి మెరిట్, రిజర్వేషన్ ఆఫ్ రోస్టర్ ఆధారంగా ఎంపిక చేసి నియమించారు. డాక్టర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దవాఖానలో అందుబాటులో ఉంటున్నారు. వైద్యం కోసం వచ్చే వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. కేవలం ఓపీ మాత్రమే చూస్తున్నారు.
అవసరమైన వారికి మందులను ఉచితంగా అందిస్తున్నారు. దవాఖానలో ఉండి చికిత్స పొందే రోగులను సమీపంలోని ప్రధాన దవాఖానకు రెఫర్ చేస్తున్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి వాటికోసం పట్టణ ప్రాంతాల్లోని దవాఖానలకు వెళ్లడం తప్పింది. రానున్న రోజుల్లో వీటిని 24గంటలపాటు వైద్యసేవలు అందేలా తీర్చిదిద్దేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేసింది. అందులో భాగంగానే మా గ్రామానికి పల్లెదవాఖాన ను మంజూరు చేసి, ఏ ర్పాటు చేశారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చొ రవతో పల్లెదవాఖానను ని ర్మించుకొని, ప్రారంభించుకున్నాం. స్థానికంగానే డా క్టర్ పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నా రు. పల్లెదవాఖాన ఏర్పాటుతో ఇబ్బందులు లేవు.
– నర్సింహులు, సర్పంచ్, వడ్వాట్, మాగనూర్ మండలం
పల్లె దవాఖాన ఏర్పాటు కాకముందు గ్రామస్తులు రోగాల బారిన పడితే మక్తల్, మాగనూర్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. రాత్రివేళలో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియనిస్థితిలో ఉండేవాళ్లం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేయడంతో సమస్యలు తొలగిపోయాయి.
– బసంత్‌రెడ్డి, వడ్వాట్, మాగనూర్ మండలం
15 సబ్‌సెంటర్లు ఉండగా కొత్తగా 45 సబ్ సెంట ర్ బిల్డింగ్లు నిర్మించాం. అలాగే గతంలో 15 సబ్‌సెంటర్ వైద్య పోస్టులు ఉండగా ఇటీవల 32 మంది డాక్టర్లను నియమించుకొని వారికి శిక్షణ ఇచ్చి, విధుల్లోకి చేర్చుకోవడం జరిగింది. మరో 17 మందిని విధుల్లోకి తీసుకుంటున్నాం.- రామ్మోహన్రావు,
డీఎంహెచ్‌వో, నారాయణపేట