అచ్చంపేట, ఆగస్టు 4 : బంజారాల సంప్రదాయాలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి యేటా శ్రావణమాసంలో తీజ్ వేడుకలను నిర్వహిస్తారు. శ్రావణమాసంలో వచ్చే మొదటి సోమవారం తీజ్ పండుగ వేడుకలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. తీజ్ వేడుకలు బ తుకమ్మను పోలి ఉంటుంది. ప్రధానంగా భక్తిభావంతో పెళ్లికాని యువతులు తొమ్మిది రోజులపాటు జరుపుకొంటారు. ప్రకృతితో మమేకమై మట్టిని, మొలకలను ఆరాధిస్తారు. ఈ పండుగను పూర్వకాలం నుంచి నిర్వహించుకోవడం ఆనవాయి తీ. బంజార మహిళలు, యువతుల ఆటపాట లు, నృత్యాలు, డప్పులదరువు మధ్య భక్తిభావంతో 9రోజులపాటు ప్రత్యేక ఉపవాసాలు ఉండి ఉత్సవాలు నిర్వహిస్తారు.
తొమ్మిదిరోజుల పాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. నానబెట్టిన శనగలను రేగుముళ్లను గుచ్చే ఒక విలక్షణమైన ఆచారాన్ని బోరడిఝుష్కే రో పేరుతో పిలుస్తారు. గోధుమల ను బుట్టలో చల్లేరోజు సాయం త్రం నిర్వహిస్తారు. పెళ్లికాని ఆ డపిల్లలు రేగుముళ్లకు శనగ లు గుచ్చుతుంటే తమకు బావవరుస అయినవారు ముళ్లను కదిలిస్తారు. అ యినా అమ్మాయిలు సహనంతో శనగలను ముళ్లకు గుచ్చాల్సి ఉంటుంది. చెల్లెలిని ఏడిపించేందుకు అన్నలు కూడా పాల్గొంటారు. బిందెల్లో నీళ్లను తెచ్చి బుట్లకు పోసేటప్పుడు సేవాలాల్ పాటలతో స్మరిస్తారు. తీజ్ ఎంత ఏపుగా, పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవిత భాగస్వామి వస్తారని, తమ బతుకులు పచ్చగా ఉండి, తండా బాగుపడుతుందని విశ్వసిస్తారు. ఏడో రోజు ఢమోళి చుర్మో (రొట్ట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామ అమ్మవారికి సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు బంజారాల ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. వారికి పెళ్లి చేస్తారు. ఆడపిల్లలు తమను డోక్రీలుగా ఊహించుకుంటారు. పెళ్లయితే తాము పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుంద ని ఏడుస్తారు. వారిని సోదరులు ఓదార్చుతూ, బావలు ఆటపట్టిస్తా రు. కొంత దు:ఖం, ఆనందంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు ఉంటూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మొలకలకు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. చివరి రోజు నిమజ్జనం కనులపండువగా నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉండే తమ బంధువులను ఆహ్వానిస్తారు.
చదువులు, ఉద్యోగాలరీత్యా పట్టణాలు, నగరాల్లో స్థిరపడిన వారు తండాలకు చేరుకుంటారు. మొలకల బుట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యువతులు తీజ్‌ను తలపై పెట్టుకొని డప్పుచప్పుళ్లతో సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ నిమజ్జనానికి తరలిస్తారు. అనంతరం చెరువుల్లో తీజ్‌ను నిమజ్జనం చేస్తారు. తొమ్మిదిరోజుల పాటు భక్తిశ్రద్ధలతో తీజ్‌ను పూజించిన యువతులు చెరువు వద్ద నిమజ్జనం చేసేటప్పుడు ఏడుస్తారు. సోదరులు యువతుల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. పండుగ నియమ నిష్టలతో సాగుతుంది. శ్రావణమాసం ప్రారంభం నుంచి ముగిసేవరకు తండాలు, గ్రామాల్లో తీజ్ పండుగ సందడి ఉంటుంది.