అయిజ, డిసెంబర్ 6 : ఎట్టకేలకు తుంగభద్ర డ్యాం గేట్ల పనులు షురూ అయ్యాయి. కర్ణాటకలోని టీబీ డ్యాం కొత్త క్రస్ట్‌గేట్ల బిగింపు పనులకు టీబీ డ్యాం అధికారులు శ్రీకారం చుట్టారు. పనులు నిర్విఘ్నంగా జరగాలని తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎస్ఈ నారాయణ్ నాయక్ పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం 18వ గేటు పైభాగాన్ని తొలగించారు. మొత్తం 33వ పాత గేటు తొలగించి, కొత్త గేటును బిగించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం డ్యాంలో 65 టీఎంసీలు నిల్వ ఉండగా.. క్రస్ట్‌గేట్లకు సగానికి జలాలు తగులుతుండగా.. పూర్తిగా దిగువకు చేరువయ్యే వరకు ఆలస్యం చేయకుండా గేట్ల పైభాగాలను యంత్రాల సాయంతో కత్తిరించారు. డ్యాంలో నీటినిల్వ 43 టీఎంసీలకే చేరుకునేలోగా సగం పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డ్యాం సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.
గతేడాది కొట్టుకుపోయిన 19వ గేటు
గతేడాది ఆగస్టులో తుంగభద్ర నదికి భారీ వరద రావడంతో ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో అదే స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటును బిగించారు. సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఆధ్వర్యంలో కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసింది. కమిటీ ఇచ్చిన సూచనల ఆధారంగా కేఎస్ఎస్డీటీ సర్వీసెస్ అనే సంస్థతో అధ్యయనం చేయిం చారు. ఆ సంస్థ సుమారుగా 15 రకాల పరీక్షలు నిర్వహించి ఇచ్చిన నివేదిక ఆధారంగా డ్యాంలోని 33 పాత గేటును మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం డ్యాంలో 1,621.98 అడుగులు, 67.05 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నీటిమట్టం 1,613 అడుగులకు చేరిన తర్వాత సిద్ధంగా ఉంచిన 15 గేటును మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్డీఎస్ ఆయకట్టులో క్రాప్‌హాలిడే..
తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల బిగింపు పనులకు శ్రీకారం చుట్టడంతో ఈ ఏడాది యాసంగిలో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. ఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగిన ఎస్సీఐడబ్ల్యూఎం కమిటీలో చీఫ్ ఇంజినీర్ మహమ్మద్ అంజద్ హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. జనవరి 10 వరకు మాత్రమే ఆయకట్టు సాగు నీరు అందుతుందని తెలిపారు. యాసంగిలో రైతులు ఆయకట్టు పరిధిలో పంటలు సాగు చేసేందుకు అవకాశం లేదని ఆయన తెలిపారు. రైతులు ఆర్డీఎస్ అధికారులకు సహకరించాలని కోరారు.