గట్టు, మార్చి 10 : గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో జోగులాంబ-గద్వాల్ జిల్లా గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామవాసి రవికుమార్ గౌడ్ సత్తా చాటారు. 458.5 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. గోవిందమ్మ, మునిస్వామి గౌడ్ కుమారుడైన రవికుమార్ గౌడ్ ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పదేండ్లుగా తాను పడ్డ కృషి వల్లే ఈ ప్రతిభ సాధించానని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదివే లక్ష్యంగా ముందుకు సాగినట్లు ఆయన చెప్పారు. డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎంపీడీవో దాకా తనకు ఏదో ఓ ఉద్యోగం రావడం మాత్రం ఖాయమని రవికుమార్ గౌడ్ నమస్తే తెలంగాణకు తెలిపారు. రవికుమార్ గౌడ్ ప్రతిభ పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.