జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : వంటింట్లో తీపినిచ్చే చక్కెర ఇప్పుడు పెరిగిన ధరతో చేదెక్కింది.. మరోవైపు రుచినిచ్చే ఉల్లిగడ్డ పెరిగిన ధరతో ఘాటెక్కింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో అల్లాడుతున్న సామాన్యులు.. ఇప్పుడు చక్కెర, ఉల్లి ధరలు అమాంతం పెరగటం మరింత ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల్లోనే చక్కెర, ఉల్లిపాయ ధరలు ఒక్కసారిగా 20శాతం వరకు పెరిగాయి. ప్రస్తుతం జడ్చర్ల మార్కెట్లో కిలో చక్కెర రూ. 75 నుంచి రూ. 80కి ధర పలుకుతుంది. అలాగే కిలో ఉల్లిపాయలు రూ.45 నుంచి రూ. 50కు చేరింది. రిటైల్ దుకాణాల్లో వీటి ధర రూ. 5 నుంచి రూ. 8లు అదనంగా పెరిగింది.
ఎన్నడూ లేని విధంగా చక్కెర, ఉల్లిపాయ ధరలు రికార్డుస్థాయికి చేరుకోవటంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతినిత్యం వంటల్లో ఉల్లిగడ్డ, టీ,కాఫీలకు చక్కెర వినియోగం తప్పనిసరిగా ఉండే సరుకులు. రోజు రోజుకు వీటి ధరలు పెరుగుదలతో ఏం కొనాలా..ఏం తినాలా అని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నది పండుగల సీజన్ కావడంతో చక్కెరకు డిమాండ్ మరింత పెరగనున్నది. మిఠాయిలు, తిపి వంటకాలకు చక్కెర అత్యంత కీలకం, సరిగ్గా ఈ సమయంలోనే ధరలు ఆకాశాన్ని తాకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశియ మార్కెట్లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించేందుకు అక్రమ నిల్వలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
చక్కెర లేనిదే మిఠాయిలు తయారుకావు. చక్కెర ధర పెరగటంతో మిఠాయి, బేకరీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా చక్కెర 20శాతం ధర పెరగటం తమ వ్యాపారాలకు తీవ్ర నష్టం ఏర్పడుతున్నదని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి తీపి పదార్థంలో చక్కెర తప్పనిసరైంది. ఈ పరిస్థితుల్లో మిఠాయిలకు ధరలు పెంచక తప్పదేమోనని కొందరు వ్యాపారులు తెలియజేస్తున్నారు.
మరొవైపు టీ, కాఫీలు అమ్ముకునే టీస్టాళ్లు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. చక్కెర ధర పెరగటం తమ వ్యాపారాన్ని దెబ్బకొట్టిందంటున్నారు. రోజువారీగా చక్కెర తెచ్చుకుని టీ, కాఫీలు అమ్ముకునే తమకు చక్కెర ధర పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది..ఇప్పుడు చక్కెర ధర పెరగటం తమకు మరింత ఆర్థిక భారంపడిందని టీస్టాల్ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. పెరుగుతున్న ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మిఠాయి, బేకరిలు, హోటళ్ల నిర్వాహకులు కోరుతున్నారు.
జడ్చర్లలో కొందరు వ్యాపారులు నిత్యావసర సరుకులను తమ ఇష్టానుసారంగా ధరలకు అమ్ముతున్నారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఒక్కో దుకాణంలో ఓ రేటు వసూ లు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎవరైనా అడిగితే తమ సరుకు నాణ్యమైనదని అందుకే తమ వద్ద ధర ఎక్కువగా ఉందంటూ అంటగడుతున్నారని ప్రజలు తెలియజేస్తున్నారు.
హోల్సెల్లో కిలో చక్కెర రూ. 68 నుంచి రూ. 70 వరకు ఉండగా, రిటైల్లో కిలో చక్కెర రూ. 75 నుంచి రూ. 80లకు వ్యాపారులు అమ్ముతున్నారు. అదే విధంగా హోల్సేల్లో ఉల్లి రూ. 40కి అమ్ముతుండగా, రిటైల్లో మాత్రం రూ. 45 నుంచి రూ. 50కి అమ్ముతున్నారు. రానున్న రోజుల్లో చక్కెర, ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని కొందరు వ్యాపారులు ముందస్తుగా అక్రమ నిల్వలు చేస్తున్నారని తెలుస్తోంది.
మార్కెట్లో వ్యాపారాలపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించటంలేదన్న విమర్శలు ఉన్నాయి. మార్కెట్లో నిత్యావసర సరుకుల నాణ్యత, తుకాలపై సం బంధిత అధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇదే అదునుగా కొందరు వ్యాపారు లు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా నిత్యావసర సరుకులను అమ్మి సొమ్ము చేసుకుంటున్నార ని ఆరోపణలున్నాయి. మరొవైపు గల్లీగల్లీకి సూపర్మార్కెట్ల పేరుతో వెలిసిన దుకాణాల్లో సరుకులను ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు.
ఈ క్రమంలో కొందరు వ్యాపారులు ప్యాకింగ్ సరుకుల నాణ్యత, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇదిఇలా ఉండగా ఎప్పటికప్పుడూ వ్యాపారాలపై దృష్టిసారించాల్సిన సంబంధిత శాఖ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీ లు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారని వి మర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర ధరలు పెరుగుతున్న క్రమం లో కొందరు వ్యాపారులు బ్లాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రో జుల్లో సామాన్య ప్రజలపై మరింత ఆర్థికభా రం పడే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి ధరల ని యంత్రణతోపాటు నాణ్యత, తూకాల్లో జరిగే మోసాలను అరికట్టాల్సినసవరం ఉన్నది.