మరికల్ : మరికల్ మండలంలోని చిత్తనూరు ఎర్రగుట్ట రామాలయంలో ఆషాడశుద్ధ ఏకాదశి ( Ekadasi) పురస్కరించుకొని ఆదివారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయంలో సుదర్శన హోమాన్ని ( Sudarshana Homam ) ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం వేదమంత్రాలతో శ్రీకాంత్ ఆచారి సుదర్శన హోమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు.
అనంతరం భక్తుల భజనతో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఏకాదశి రోజు సుదర్శన హోమం చేయడం ద్వారా విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు పుష్కలంగా భక్తులకు లభిస్తాయని అర్చకులు తెలిపారు.
ప్రతి పౌర్ణమికి ఆలయ ప్రాంగణంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయకర్త లక్ష్మి కాంత్రెడ్డి తో పాటు మరికల్, మక్తల్ తదితర మండలాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.