అయిజ రూరల్, మార్చి 18 : మండలంలోని సం కాపురం గ్రామంలో తాగు నీటి బోరుమోటర్ పాడవ్వడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో నాలుగు రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో బోరు మరమ్మతును అధికారులు పట్టించు కోకపోవడంతో గ్రామస్తులే చందాలు వేసుకొని మోటర్ మరమ్మతులు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోమవారం ఇంటింటికీ తిరిగి ఇంటికి రూ. 200 చొప్పున చందాలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి నిధులు లేక అధికారులు సైతం మరమ్మతు పనులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎండలు అధికం కావడంతో తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ పైప్లైన్ ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో బోరునీటితోనే ప్రజలు అవసరాలు తీర్చుకుంటున్నారు. పదిరోజల కిందట బోరు మోటర్, స్టార్టర్ కాలిపోగా గ్రామంలోని ప్రజలు, యువకుల ద్వారా విరాళాలు సేకరించి మరమ్మతులు చేయించారు. వారం రోజులు పనిచేసిన మోటర్ మళ్లీ కాలిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి రెండో సారి గ్రామంలో ఇంటింటికీ తిరిగి రూ. 200 చొప్పున వసూలు చేస్తున్నారు. కొంత మంది పేదవారు డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బంది పడుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా లేకపోవడం తో గ్రామ శివారులోని వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తూ ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. వేసవి దృష్ట్యా రైతులు సైతం గ్రామస్తులకు తాగునీరు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి కేం ద్రీకరించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై సోమవారం పంచాయతీ కార్యదర్శిని కలిసి ఆరా తీయగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని తెలిపారు.
నాలుగు రోజులుగా గ్రా మానికి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకొని వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలి. లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తాం.
మూడు రోజులుగా తాగునీరు లేకపోవడంతో వ్యవసాయ బోరు నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి దృష్ట్యా రైతులు సైతం బోర్ల వద్దకు రావద్దని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇలాగైతే మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు.
సంకాపురం గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య నా దృష్టికి వచ్చింది. ప్ర స్తుతం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తా. వీలైనంత త్వరగా బోరు మోటరుకు మరమ్మతులు చేయిస్తాం.