రాయపోల్ : పాఠశాలలకు వేసవి సెలవులు ( summer vacations ) ప్రకటించిన సందర్భంగా విద్యార్థులు చల్లదనం కోసం చుట్టుపక్కల ఉండే కుంటలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని రాయపోల్ ఎస్సై రఘుపతి (SI Raghupathi) సూచించారు. స్నేహితుల ప్రోద్భలంతో ఈతకు వెళ్లడం లాంటివి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని పేర్కొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెరువులు, కుంటల వద్దకు ఎటువంటి రక్షణ సదుపాయాలు లేకుండా వెళ్ళనీయవద్దన్నారు. మండల ప్రజలు గ్రామాల్లో ఎవరైనా శుభకార్యాలకు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు. నగదు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. ఇతర గ్రామాలకు వెళ్లినప్పుడు సమాచారం పోలీసులకు అందించాలన్నారు.
వేసవిలో ఇంటికి తాళం వేసి బిల్డింగ్ పైన పడుకుంటే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దొంగతనాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే రాత్రి వేళల్లో సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బెట్టింగులు, మత్తు పదార్థాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.