అయిజ, సెప్టెంబర్ 27 : టీచర్లను నియమించి తమకు సరైన విద్యాబోధన అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని టీటీదొడ్డి ఎంపీహెచ్ఎస్కు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శుక్రవారం పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలోని ఏడు తరగతులు.. 188 మంది విద్యార్థులకుగానూ ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండ గా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారన్నారు.
దీంతో తమ చదువు ఎలా కొనసాగాలని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎం పాఠశాల విధులు, శిక్షణ తరగతులు, పనిపై బయటకు వెళ్తుండడంతో.. ఒక్క ఉపాధ్యాయుడే పాఠాలు బోధిస్తున్నారన్నారు. గతేడాది పాఠశాలలో 8వ తరగతి వరకు ఉండేదని, ఈ ఏడాది ఉపాధ్యాయులు లేకపోవడంతో టీసీ తీసుకొని సింధనూర్ జెడ్పీహెచ్ఎస్లో చేర్పించామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ టీచర్లను నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. అదనపు ఉపాధ్యాయులను నియమించే వరకు నిరసన విరమించమని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో రాములు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం తిమ్మారెడ్డి పాఠశాలకు చేరుకొని తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించే వరకు ఒకరిని శనివారం నుంచి డిప్యూటేషన్‌పై పంపుతామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.