కల్వకుర్తి, డిసెంబర్ 1 : మాగనూర్ ఘటనలు కళ్లముందు కదలాడుతున్న ప్రభుత్వ యంత్రాంగంలో చల నం లేదనే విమర్శలు బాహటంగా వినిపిస్తున్నారు. ఆరుబయట వండటం, నాసిరకం బియ్యం, వంటసామగ్రి, కలుషిత నీరు వినియోగించడం తదతర కారణాలతో పాఠశాలల్లో వండుతున్న మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగనీయొద్దనే ఎప్పటికప్పుడు వంట ఏజెన్సీలకు బిల్లులు చెల్లిస్తూ, సన్న బియ్యాన్ని సరఫరా చేసింది.
మన ఊరు- మన బడి పథకం కింద వంట గదులు, మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీరు, విద్యార్థులు కూర్చొని తీనేందుకు వీలు గా డైనింగ్ హాల్లను నిర్మించేందుకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన ఊరు- మన బడి పథకం అటకెక్కింది. నిధుల లేమీతో డైనింగ్, వంట గదుల నిర్మా ణం, మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణాలు అర్ధాంతరం గా నిలిచిపోయాయి. వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లు లు రాక అరిగోస పడుతున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు చదువకుంటున్న పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కడుపునింపలేకపోతుంది.
కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడిమంలో దాదాపు 500మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో చాలామంది విద్యార్థులు బీసీ, ఎస్సీ వసతిగృహాల్లో చదువుకుంటున్న వారితోపాటు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు విద్యనభ్యసిస్తూన్నారు. వీరు మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే చేస్తున్నారు.
కల్వకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, సంతృప్తిగా కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా డైనింగ్ హాల్, ఆధునిక వసతులతో కూడిన వంట గది, ప్లేట్లు కడుక్కోవడానికి వాషింగ్ ఏరియా, సింక్లు, తాగడానికి మిషన్ భగీరథ ట్యాంకు, నల్లాల ఏర్పాటుకు దాదాపు రూ.37లక్షల నిధులను కేటాయించి పనులను ప్రారంభించింది. పనులు సగం వరకు పూర్తి కాగానే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన ఊరు-మన బడి పథకానికి నిధులు కేటాయించకపోడంతో పనులు ఆగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడం తో కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు. పేద విద్యార్థులకు మ ధ్యాహ్న భోజన విషయంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆరుబయట వంట, చెట్ల కింద భోజనాలు, దూరంగా పైప్ వేసుకుని పైప్ద్వారా వచ్చే నీటితో ప్లేట్లు కడుక్కోవడం షరా మామూలుగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వంట ఏజెన్సీలకు సంకటంగా మారింది. డబ్బులు నెలనెల రాకపోవడంతో వంట సామగ్రికి అప్పు చేయాలి. అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఎప్పుడో ఒకనెలకు సంబంధించిన డబ్బులు వస్తే ప్రసాదం పంచినట్లే అవుతుందని వంట ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. వంట సామగ్రి రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వంట చేస్తే కనీసం కూలీ గిట్టుబాటు అవుతుందని అనుకుంటే.. అసలుకే మోసం వస్తుందని వంట ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.7ఉంటే మాకు మాత్రం రూ.5 చెల్లించడంతో రూ.2 నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.