గద్వాల, అక్టోబర్ 28 : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం డ్ చేశారు. సోమవారం 200మంది విద్యార్థులతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లయ్య మాట్లాడారు. విద్యావ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని చెప్పారు.
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తాళాలు వేసి రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ప్రభుత్వం కల్పించడం బాధాకరమన్నారు. చాలా మంది స్కాలర్షిప్స్ రాకపోవడంతో కళాశాలల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలను గాలికొదిలేయడంతో నిత్యం సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు ప్రేమలత, విద్యార్థి విభాగం నాయకులు మాధవ్, మత్తాలి, ఖాజావలి, సోమశేఖర్నాయుడు, నర్సింహ, వీరేశ్, రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.