నారాయణపేట, మార్చి 11: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఈనెల 13వ తేదీన పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తం 664 మంది ఓటర్లకుగానూ 5పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. పోలింగ్ కేంద్రాలను 2రూట్లుగా విభజించి ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, ఎస్సైలు మొత్తం 100మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ రోజు సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచాలని, మద్యం అక్రమంగా సరఫరా కాకుండా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు విధుల్లో ఉన్న పోలీసులు అత్యవసర సమయంలో పైఅధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
కర్ణాటక, తెలంగాణ సరిహద్దు జిల్లాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలబుర్గి అడిషనల్ ఎస్పీ శ్రీనిధి, రాయచూర్ డీఎస్పీ సత్యనారాయణ, వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం కర్ణాటకలోని కలబుర్గి జిల్లాకేంద్రంలో కలబుర్గి, నారాయణపేట, బీదర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పోలీసులతో సరిహద్దు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పేట సీఐ రవిబాబు, దామరగిద్ద ఎస్సై శ్రీనివాసరావు హాజరయ్యారు. అదేవిధంగా రాయచూర్ జిల్లాకేంద్రంలో రాయచూర్, గద్వాల, కర్నూల్, యాద్గీర్ జిల్లాల పోలీసులతో సరిహద్దు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మక్తల్ సీఐ సీతయ్య, మాగనూర్ ఎస్సై నరేందర్ హాజరయ్యారు. ఆయా సమావేశాల్లో రోడ్డు ప్రమాదాలు, ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్, దొంగతనాలు, హత్యలు, మిస్సింగ్, గుట్కా, పీడీఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణా, చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల పోలీసులు సంయుక్తంగా వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకొని నేరాలకు సంబంధించిన సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు.
పోలీసులు విధులు నిర్వర్తించే సమయంలో క్రమశిక్షణ, సమయపాలన ఉండాలని ఆర్ఐ కృష్ణయ్య అన్నారు. శనివారం పట్టణంలోని పరేడ్ మైదానంలో వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీక్లీ పరేడ్ వల్ల శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటారన్నారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలన్నారు. అనారోగ్యానికి గురికాకుండా శక్తిసామర్థ్యాలతో విధులు నిర్వర్తించడానికి వ్యాయామం ఉపయోగపడుతుందన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు డేవిడ్ విజయ్‌కుమార్, ఆర్ఎస్సైఐ ఇందిర, శివశంకర్, ఆర్మ్డ్ రిజర్వ్, సర్కిల్ పోలీసులు పాల్గొన్నారు.