పెద్దకొత్తపల్లి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ముఖ హాజరు( Face Recognised ) శాతం వందశాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ (DEO Ramesh Kumar) ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం మండలంలోని ముష్టిపల్లి, పెరుమల్లపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ముష్టిపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల గణిత సబ్జెక్ట్ సామర్థ్యాలను పరిశీలించి గణితంలో విద్యార్థులు రాణించేలా మెలకువలను బోధించారు.పదో తరగతి విద్యార్థుల పట్ల ఇప్పటినుంచి ప్రణాళికాబద్ధంగా బోధనా ప్రక్రియలను కొనసాగించాలని సూచించారు. సబ్జెక్టుల వారిగా వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
ఏడు సంవత్సరాలుగా మూతపడిన పెరుమల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ సంవత్సరం బడిబాట ద్వారా 15 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడి సర్దుబాటు నియామకంతో పున: ప్రారంభంతో కొనసాగుతుందని తెలిపారు.పాఠశాలకు మరింత మంది ఉపాధ్యాయులు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయుడికి సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించి, రోజువారి మోనూను అమలు చేసి నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అమలుపరచాలని ఆదేశించారు. డీఈవో వెంట సమగ్ర శిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్ నూరుద్దీన్ తదితరులున్నారు.